IPL 2023: మన పొట్టి క్రికెట్‌కి గట్టి దెబ్బ.. అతి త్వరలో ఐపీఎల్‌కి ఆఖరాట..!

|

Apr 15, 2023 | 9:28 PM

బాదుడే బాదుడు. బంతిబంతికీ బాదుడు. గ్యాలరీల్లో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపొయ్యేలాంటి వీర బాదుడు ఊర బాదుడు. ఇలా క్రికెట్‌లో బాదుడు అనే కాన్సెప్ట్‌కి తెర తీసింది ఐపీఎల్ ఎక్స్‌పరిమెంట్. పదహారేళ్లుగా నడుస్తున్న ఈ భలే బాదుడు కార్యక్రమం ప్రతీ సీజన్‌కీ రెట్టింపౌతూనే వస్తోంది. క్రికెట్టభిమానులకు కిక్కు..

IPL 2023: మన పొట్టి క్రికెట్‌కి గట్టి దెబ్బ.. అతి త్వరలో ఐపీఎల్‌కి ఆఖరాట..!
Saudi Arabia T20
Follow us on

బాదుడే బాదుడు. బంతిబంతికీ బాదుడు. గ్యాలరీల్లో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపొయ్యేలాంటి వీర బాదుడు ఊర బాదుడు. ఇలా క్రికెట్‌లో బాదుడు అనే కాన్సెప్ట్‌కి తెర తీసింది ఐపీఎల్ ఎక్స్‌పరిమెంట్. పదహారేళ్లుగా నడుస్తున్న ఈ భలే బాదుడు కార్యక్రమం ప్రతీ సీజన్‌కీ రెట్టింపౌతూనే వస్తోంది. క్రికెట్టభిమానులకు కిక్కు.. బీసీసీఐకీ పైసా వసూల్. ఇంత క్రేజున్న ఐపీఎల్‌కి మంగళం పాడేస్తారు అంటే! ఓ మై గాడ్.. లైఫ్ వితౌట్ ఐపీఎల్.. ఊహించడానికే కష్టం కదా? కానీ.. నో మోర్ ఐపీఎల్. కిక్కిచ్చే మాంచి క్రికెట్ షోకి ఇక చెల్లుచీటీ తప్పదు. అంటూ బ్యాడ్‌ సిగ్నల్స్ సాలిడ్‌గానే కనిపిస్తున్నాయి. మన ఐపీఎల్‌ని మింగెయ్యడానికి అనకొండ ఒకటి సిద్ధంగా ఉందట. ఐపీఎల్‌ని క్లీన్‌బౌల్డ్ చేసి.. సిక్సర్స బాధ్యతను మేం తీసుకుంటాం అంటూ దుబాయ్ నుంచి దండోరా వినిపిస్తోంది. అయితే మాత్రం మనం ఒప్పుకుంటామా ఏంటి..?

బాలుకో సిక్సర్‌, ఓవర్‌కో గేమ్‌, మ్యాచుకో మజా.. క్రికెట్‌ని మన రక్తంలో కలిపేసి, కోట్లాదిమంది జీవితాల్నే క్రికెట్‌కి అంకితం చేసిన క్రెడిట్ ఎవరిదంటే.. ఇంకెవరిది ఐపీఎల్‌దే. ఐపీఎల్ మ్యాచ్ అంటేనే మల్టిప్లెక్సుల్లో గొప్ప మల్టిస్టారర్‌ సినిమాను చూస్తున్నట్టే ఉంటుంది. నాటునాటు బీటుకు డ్యాన్సాడినట్టు.. ఊరనాటు పెర్ఫామెన్సులతో గుండెల్లో డండనక ఆడిస్తుంది.

అయితే.. ఇంత మజానిచ్చే ఐపీఎల్‌ మీద దుబాయ్ కన్ను పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని తలదన్నేలా.. మేమూ ఒక లీగ్‌ను ప్రారంభించబోతున్నాం. గెట్‌ రెడీ అంటోంది సౌదీ అరేబియా. ఇప్పటికే ఫుట్‌బాల్, ఫార్ములా1 లాంటి క్రీడల్ని ఫ్యాన్సీ స్పోర్ట్స్‌గా మార్చి.. వాటితో మిలియన్లకొద్దీ డాలర్లు పండించుకుంటోంది సౌదీ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ క్రికెట్. కాసులున్న దేశం.. పైగా క్రికెట్టంటే పడిచచ్చే షేకులు అనబడే అరబ్బీ కుబేరులు. సో.. వరల్డ్స్ రిచ్చెస్ట్ టీ20 క్రికెట్ లీగ్ ఇదే కాబోతోంది.. ఇందులో ఐతే నో డౌట్స్.

ఇవి కూడా చదవండి

ట్వంటీ20 అంటేనే మజా. అందులో ఐపీఎల్‌ ఎక్స్‌పరిమెంట్ అంటే డబుల్ మజా. ట్రిపుల్ మజా. లలిత్ మోడీ అనే కార్పొరేట్ క్రూసేడర్, క్రీడా ఔత్సాహికుడు పుణ్యం చేసుకోబట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనబడే ఒక అద్భుతమైన ప్రయోగం ఆవిష్కృతమైంది. మనోళ్లకు క్రికెట్‌ను కొత్తగా చూడ్డం ఎలాగో నేర్పించింది. అభిమానుల్లో క్రికెట్ పట్ల లవ్వును పెంచింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్‌ని రెట్టింపు చేసిందీ అన్నీ ఈ లలిత్‌ మోడీనే. ఏ సీజన్‌కి ఆ సీజన్‌ పుంజుకుంటూ ఆకాశమంత ఎత్తుకెదిగింది ఇండియన్ ప్రీమియర్ లీగ్.

టోటల్‌గా.. ఒకేఒక్క దెబ్బతో వన్‌డేల్ని, టెస్టు మ్యాచుల్ని ఉఫ్ఫున ఊదిపారేసింది ఐపీఎల్. కార్పొరేట్ బిజినెస్‌ని, క్రికెట్‌ ఆటను ఒక్క తాటి మీదకు తీసుకొచ్చి.. ఐపీఎల్ బిజినెస్ సైజును కోటానుకోట్లకు పెంచేశారు లలిత్ మోదీ. ఆటగాళ్లను నిలబెట్టి.. వేలం పాటలో కొనుక్కోవడం అనే వెర్రి కూడా అక్కడే మొదలైంది. రిసెంట్‌గా సామ్ కురన్ రూ. 18.5 కోట్లకు. బెన్ స్టోక్స్‌ రూ. 17.5 కోట్లకు అమ్ముడుబోయారు. 2022 ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ అక్షరాలా రూ. 90 వేల కోట్లు. రెండేళ్ల టైటిల్ స్పాన్సర్‌షిప్‌కే రూ. 670 కోట్లు కుమ్మరించింది టాటా గ్రూప్. ప్రస్తుతానికి ప్రపంచంలోకెల్లా మన ఐపీఎలే కాస్ట్‌లీయస్ట్ ఐపీఎల్.

బెట్టింగులు పెట్టినోళ్లు, పెట్టనోళ్లు కూడా ఐపీఎల్ మ్యాచుల్ని వెర్రిగా చూస్తూ, బాల్‌టుబాల్‌ ఎంజాయ్ చేస్తున్నారు. పిచ్చెక్కించే పొలిటికల్ సీజన్లో కూడా క్రికెట్ అనే వైరల్ జ్వరం వ్యాపిస్తూనే ఉంది. పైగా.. గతంలోలా మ్యాచుల్ని చూడాలంటే ఇంటిదగ్గరే టీవీలకు అంటిపెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ పోన్లో సైతం ప్రత్యక్ష ప్రసారాలొస్తున్నాయి. ఆవిధంగా వర్కు ప్లేసుల్లో కూడా లైవ్‌ పెర్ఫామెన్సుల్ని చూస్తూ ఫిదా అవుతోంది క్రికెట్ ఫ్యాన్ ప్రపంచం. మనకూ క్రికెట్టుకూ ఇంత కనెక్టివిటీ పెంచేసిన ఐపీఎల్.. ఇప్పుడు ప్రమాదంలో పడిందా? సౌదీ అరేబియా కనుక ఎంట్రీ ఇస్తే.. మన ఐపీఎల్‌కి ఆఖరాట తప్పదా?

ఆల్రెడీ ఇండియన్ క్రికెట్ యాక్టివిటీస్‌ మీద ఓ కన్నేసి లోతుగా స్టడీ చేస్తోంది సౌదీ గవర్నమెంట్. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లనీ, బీసీసీఐనీ తమ వైపు లాక్కోవడమెలా అనే మేజిక్‌ని వర్కవుట్ చేస్తున్నాయి అక్కడి బిజినెస్ సెంటర్లు. సౌదీ వాసులకు, ఇక్కడుండే ప్రవాసులకు సరికొత్త వ్యాపార సామ్రాజ్యాన్ని పరిచయం చెయ్యడం, ప్రపంచ క్రికెట్‌కి సౌదీని క్యాపిటల్‌గా మార్చడం.. ఇవే మా ముందుండే లక్ష్యాలని ఓపెన్‌గానే చెప్పేశారు సౌదీ క్రికెట్ ఫెడరేషన్ ఛైర్మన్ సయ్యద్ బిన్ మిషల్.

ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ -ICC ఇప్పటికే సౌదీ మాయలో పడిపోయింది. క్రికెట్‌కున్న చరిష్మాను, ఫాలోయింగ్‌ను ఇంకాఇంకా పెంచాలంటే సౌదీ వాళ్ల వల్లే సాధ్యం. ఫుట్‌బాల్‌నీ, ఫార్ములా1నీ పవర్‌ఫుల్ స్పోర్ట్స్‌గా మార్చింది సౌదీనే కదా అంటూ సపోర్టిస్తోంది ICC. ప్రస్తుతానికి BCCI రూల్స్ ప్రకారం.. విదేశీ లీగుల్లో ఆడేందుకు మన ఆటగాళ్లకు అవకాశం లేదు. కానీ.. సౌదీ అరేబియా ఇవ్వజూపే ‌ఫ్యాన్సీ ఆఫర్లకు, మెస్మరైజింగ్ డీల్స్‌కి బీసీసీఐ కూడా ఫ్లాటవ్వకుండా ఎందుకుంటుంది? ఇప్పటికే బీసీసీఐని లైన్లో పెడుతోంది సౌదీ. ఆసియా కప్‌ ఫస్ట్ మ్యాచ్‌కి, ఒక ఐపీఎల్ సీజన్ మొత్తానికీ హోస్టింగ్ చేస్తామంటూ ముందుకొచ్చింది సౌదీ క్రికెట్ అథారిటీ. నెక్స్ట్‌స్టెప్ ఏంటంటే.. ఇంకేంటి.. సౌదీ సమర్పించు ఖరీదైన ఖతర్నాక్ క్రికెట్ లీగ్ ఏర్పాటు.. అందులో మన స్టార్ క్రికెటర్ల జోరైన ఇన్నింగ్స్. ఎంత ప్లేయరైనా కాసు దాసుడేగా? మేం గనుక వేలం గనుక మొదలుపెడితే అమ్ముడుబోడానికి ధోనీలూ గీనీలూ ఎవ్వరైనా దిగొస్తారు అనేది సౌదీ వాళ్లకున్న దీమా. ఇండియన్ ప్లేయర్లే కాదు.. మిగతా దేశాల్లో స్టార్‌ క్రికెటర్లను కూడా డబుల్ రేటిచ్చి కొనుక్కోగల సత్తా ఉంది సౌదీ దగ్గర.

సౌదీ ప్రీమియర్ లీగ్‌.. బాప్‌ ఆఫ్ ఆల్ ది లీగ్స్! ఐపీఎస్ అనేది క్రమంగా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఒకవేళ బీసీసీఐ సౌదీ వాళ్ల మాయలో పడితే.. తన మోకాళ్లను తానే విరగ్గొట్టుకున్నట్టే. 16 ఏళ్ల చరిత్రున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను చరిత్రలో కలిపేసి, చెత్తబుట్టకే పరిమితం చేసినట్టు. హిట్‌వికెట్ అంటారే ఇదే ఇది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..