AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2026 : 45 నిమిషాల్లోనే రెండు పసిడి పతకాలు.. కామన్వెల్త్ బాక్సింగ్‌లో భారత్ సరికొత్త చరిత్ర

CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్స్ వర్షం కురిపించారు. సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, అరుంధతి, సచిన్ సివాచ్ స్వర్ణాలు సాధించగా, లవ్లీనా బోర్గోహైన్ రజతంతో ముగించింది. భారత్ మెడల్స్ టేబుల్‌లో భారీ జంప్ చేసింది.

CWG 2026 : 45 నిమిషాల్లోనే రెండు పసిడి పతకాలు.. కామన్వెల్త్ బాక్సింగ్‌లో భారత్ సరికొత్త చరిత్ర
Cwg 2026
Rakesh
|

Updated on: Aug 02, 2026 | 6:44 AM

Share

CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకాల వర్షం కురిపించారు. మహిళల 51 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ సాక్షి చౌదరి బంగారు పతకం సాధించి శుభారంభం ఇచ్చింది. ఇది భారత్‌కు ఈ కామన్వెల్త్‌లో 9వ స్వర్ణ పతకం కాగా, ఆ తర్వాత కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మరో 3 పసిడి పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి. మొత్తంగా 12 స్వర్ణ పతకాలతో భారత్ మెడల్స్ టాలీలో భారీ జంప్ చేసి అగ్రస్థానాల వైపు దూసుకెళ్లింది.

ఫైనల్‌లో సాక్షి చౌదరి వన్ సైడ్ విక్టరీ

మహిళల 51 కేజీల ఫైనల్ పోరులో సాక్షి చౌదరి ఇంగ్లాండ్‌కు చెందిన రూబీ వైట్‌ను 5-0 తేడాతో ఘోరంగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే సాక్షి రింగ్‌లో తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చివరి రౌండ్‌లో రూబీ వైట్ పుంజుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, సాక్షి తన పంచ్‌లతో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పసిడి పతకాన్ని ముద్దాడింది.

కేవలం 45 నిమిషాల్లోనే రెండు గోల్డ్ మెడల్స్

సాక్షి విజయం సాధించిన 45 నిమిషాల వ్యవధిలోనే భారత్ మరో రెండు స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించింది. రాత్రి 9:35 గంటల ప్రాంతంలో ప్రియా ఘంఘాస్ మహిళల 60 కేజీల ఫైనల్లో కెనడాకు చెందిన మేరీ బాతౌల్ అల్-అహ్మదియేను 4-1 తేడాతో ఓడించి భారత్‌కు 10వ స్వర్ణాన్ని అందించింది. ఆ వెంటనే రాత్రి 10 గంటలకు అరుంధతి మహిళల 70 కేజీల కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించి భారత్ ఖాతాలో 11వ పసిడిని జమ చేసింది.

లాస్ట్ సెకండ్ డ్రామా.. సచిన్ సివాచ్ థ్రిల్లింగ్ గోల్డ్

పురుషుల 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ ఫైనల్ పోరు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. నమీబియా బాక్సర్ ట్రైఎగైన్ ఎన్డెవెలోతో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ తొలి రౌండ్ ఓడిపోయాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ఆఖరి క్షణాల్లో సచిన్ సంచలన రీతిలో ఓవర్‌హ్యాండ్ క్రాస్ పంచ్ విసిరాడు. దీంతో నమీబియా బాక్సర్ కిందపడిపోగా, రెఫరీ కౌంటింగ్ ప్రారంభించారు. ఈ క్షణం మ్యాచ్‌కే కీలక మలుపుగా మారి సచిన్ విజయాన్ని ఖరారు చేసింది. ఇది శనివారం బాక్సింగ్‌లో భారత్‌కు లభించిన 6వ స్వర్ణం కావడం విశేషం.

రజతంతో సరిపెట్టుకున్న స్టార్ బాక్సర్

మరోవైపు స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ నుంచి కూడా అభిమానులు పసిడి పతకాన్ని ఆశించారు. అయితే ఫైనల్ పోరులో తీవ్రంగా శ్రమించినప్పటికీ లవ్లీనాకు విజయం లభించలేదు. దీంతో ఆమె రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ, శనివారం నాటి బాక్సింగ్ పోటీలు భారత క్రీడా చరిత్రలో నిలిచిపోయేలా సాగాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us