CWG 2022 Weightlifting: బర్మింగ్‌హామ్‌లో అదరగొట్టిన అచింత.. భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం

COMMONWEALTH GAMES:కామన్వెల్త్ గేమ్స్-2022 లో భారత వెయిట్ లిఫ్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది . ఇప్పటికే రెండు రోజుల్లో ఐదు పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్లు మరో పతకాన్ని భారత్ ఖాతాలో చేర్చారు. తాజాగా పురుషుల 73 కిలోల విభాగంలో 20 ఏళ్ల అచింత షూలి..

CWG 2022 Weightlifting: బర్మింగ్‌హామ్‌లో అదరగొట్టిన అచింత.. భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం
Achinta Sheuli

Updated on: Aug 01, 2022 | 7:58 AM

COMMONWEALTH GAMES:కామన్వెల్త్ గేమ్స్-2022 లో భారత వెయిట్ లిఫ్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది . ఇప్పటికే రెండు రోజుల్లో ఐదు పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్లు మరో పతకాన్ని భారత్ ఖాతాలో చేర్చారు. తాజాగా పురుషుల 73 కిలోల విభాగంలో 20 ఏళ్ల అచింత షూలి (Achinta Sheuli) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ వెయిట్‌లిఫ్టర్ స్నాచ్‌ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల బరువు లిఫ్ట్‌ చేశాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 140 కేజీలు.. మూడో ప్రయత్నంలో 143 ఎత్తి గేమ్స్‌ రికార్డును సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు. ఇక క్లీన్‌ అండ్‌ జెర్క్‌లోనూ తొలి ప్రయత్నంలో 166 కేజీలు తేలిగ్గా ఎత్తిన అచింత.. రెండో లిఫ్ట్‌లో 170 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. అయితే మూడో ప్రయత్నంలో 170 కేజీలు లిఫ్ట్‌ చేసి మొత్తం మీద 313 కేజీలతో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో మలేషియాకు చెందిన హిదాయత్‌ (303 కేజీలు) రజతం గెలవగా.. కెనడాకు చెందిన షాద్‌ (298 కేజీలు) కాంస్యం సాధించాడు. కాగా 2021 జూనియర్‌ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం గెలిచిన అచింత.. కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో 2019, 2021ల్లో ఛాంపియన్‌గా నిలిచాడు.

ఆరో ప్లేస్‌కి జంప్‌..
కాగా ఇప్పటివరకు మన అథ్లెట్లు 3 స్వర్ణాలతో సహా మొత్తం 6 పతకాలు గెల్చుకున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలోనే 3 బంగారు పతకాలు, 2 రజతాలు, ఒక కాంస్య పతకాలు వచ్చాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. ఇక ఎప్పటిలాగానే ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు ఇప్పటివరకు 22 బంగారు పతకాలు, 13 రజతాలు, 17 కాంస్యాలతో మొత్తం 52 మెడల్స్‌ గెల్చుకున్నారు. ఇక ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌ 11 స్వర్ణాలతో సహా మొత్తం 34 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..