Yuzvendra Chahal : చాహల్-ధనశ్రీ విడాకుల వెనుక అసలు నిజం.. వైరల్ అవుతున్న పాత ఇంటర్వ్యూ

Yuzvendra Chahal : యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల వ్యవహారం మరోసారి తీవ్రంగా చర్చనీయాంశమైంది. ధనశ్రీ వర్మ పాత ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండ గా, వారి బంధం ముగిసిన కారణాలపై మళ్లీ చర్చ మొదలైంది.

Yuzvendra Chahal : చాహల్-ధనశ్రీ విడాకుల వెనుక అసలు నిజం.. వైరల్ అవుతున్న పాత ఇంటర్వ్యూ
Yuzvendra Chahal

Updated on: Jul 11, 2026 | 7:24 PM

Yuzvendra Chahal : భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ మార్చి 2025లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2020లో ఎంతో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న ఈ జంట, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకే విడిపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే వీరిద్దరి బంధం ఎందుకు ముగిసిందనే దానిపై ప్రస్తుతం ధనశ్రీ వర్మకు సంబంధించిన ఒక పాత ప్రకటన నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఆమె చాహల్‌పై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

నిజానికి ధనశ్రీ వర్మ గతంలో రైజ్ అండ్ ఫాల్ అనే ఒక పాపులర్ రియాలిటీ షోలో పార్టిసిపెంట్ గా ఉన్నప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని కీలక విషయాలను పంచుకుంది. చాహల్‌తో తన పెళ్లి ఎక్కువ కాలం నిలవదని తనకు వివాహమైన మొదటి ఏడాదిలోనే అర్థమైపోయిందని ఆ షోలో ధనశ్రీ ఓపెన్ అయ్యింది. అంతేకాకుండా, పెళ్లయిన రెండో నెలలోనే తాను చాహల్‌ను ఏదో ఒక విషయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అప్పటి నుంచే వారిద్దరి మధ్య నమ్మకం దెబ్బతిందని, అదే తమ బంధం ముగిసిపోవడానికి పునాది అని ఆమె ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఆ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ హల్ చల్ చేస్తోంది.

ఈ స్టార్ కపుల్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు ఇప్పటివి కావు. పెళ్లయిన కొన్నాళ్లకే వీరి మధ్య మనస్పర్థలు రావడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 2022 సంవత్సరంలో ధనశ్రీ వర్మ తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ (ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్) నుంచి చాహల్ అనే సర్నేమ్‌ను తొలగించడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు మొదటిసారి వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత చాలా కాలం పాటు వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండకుండా విడివిడిగానే జీవించారు. చివరకు విడాకులు తీసుకోవడమే బెస్ట్ అని భావించి కోర్టును ఆశ్రయించగా.. 20 మార్చి 2025న బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరి విడాకుల పిటిషన్‌ను అధికారికంగా మంజూరు చేసింది. దీంతో వీరి నాలుగేళ్ల వైవాహిక బంధానికి చట్టబద్ధంగా ఎండ్ కార్డ్ పడింది.

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల లవ్ స్టోరీ కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో చాలా విచిత్రంగా మొదలైంది. లాక్‌డౌన్ లో ఖాళీగా ఉన్న సమయంలో చాహల్ డాన్స్ నేర్చుకోవాలని భావించి ధనశ్రీ ఆన్‌లైన్ డాన్స్ క్లాస్‌లో జాయిన్ అయ్యాడు. అలా మొదలైన వీరి పరిచయం కొద్దిరోజుల్లోనే స్నేహంగా, ఆ తర్వాత ప్రేమికులుగా మారింది. పెళ్లికి ముందు వీరిద్దరూ దాదాపు 6 నుంచి 7 నెలల పాటు డేటింగ్ చేశారు. పరస్పర అంగీకారంతో అదే ఏడాది అంటే డిసెంబర్ 2020లో ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఎంతో అందంగా సాగుతుందనుకున్న వీరి లాక్‌డౌన్ ప్రేమకథ కేవలం 4 సంవత్సరాలకే కోర్టు మెట్లు ఎక్కి ముగిసిపోవడం గమనార్హం.

ఎంతటి బలమైన బంధమైనా విడిపోయేటప్పుడు మనసుకు చాలా బాధ కలుగుతుందని ధనశ్రీ వర్మ అంగీకరించింది. అయితే, తమ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నంత మాత్రాన ఒకరినొకరు కించపరుచుకోవాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడింది. తామిద్దరం విడిపోయినప్పటికీ, భవిష్యత్తులో కూడా యుజ్వేంద్ర చాహల్‌కు ఒక వ్యక్తిగా, క్రికెటర్‌గా ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎప్పటికీ ఇస్తూనే ఉంటానని ధనశ్రీ స్పష్టం చేసింది. ప్రస్తుతం చాహల్ తన క్రికెట్ కెరీర్‌పై ఫోకస్ పెట్టగా, ధనశ్రీ తన కొరియోగ్రఫీ, డిజిటల్ కెరీర్‌తో బిజీగా గడుపుతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us