ఐపీఎల్‌లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఆ తర్వాత టీమిండియాకు కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేస్తాడు..!

Abhishek Sharma Captaincy: టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మపై మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ భారీగా నమ్మకం వ్యక్తం చేశాడు. అభిషేక్‌లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పిన యువరాజ్.. ముందుగా ఐపీఎల్‌లో కెప్టెన్సీ అవకాశం దక్కితే భవిష్యత్‌లో టీమిండియాకు నాయకత్వం వహించే దిశగా ఎదగొచ్చని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్‌లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఆ తర్వాత టీమిండియాకు కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేస్తాడు..!
Yuvraj Singh Comments On Abhishesk Sharma

Updated on: Nov 01, 2026 | 7:35 PM

Abhishek Sharma Captaincy: భారత క్రికెట్‌లో యువ ఆటగాళ్లకు అవకాశాలపై మాజీ స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా టీ20ల్లో దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ శర్మపై తన నమ్మకాన్ని వెల్లడించాడు. భవిష్యత్‌లో అభిషేక్ నాయకుడిగా ఎదిగే లక్షణాలు ఉన్నాయని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. అభిషేక్ శర్మ (Abhishek Sharma) ప్రస్తుతం భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం ఇప్పటివరకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టలేదు. 2026 సీజన్‌లో పాట్ కమిన్స్ (Pat Cummins) అందుబాటులో లేని సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఇషాన్ కిషన్ (Ishan Kishan)కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దీంతో అభిషేక్ అసంతృప్తిగా ఉన్నాడని, తదుపరి సీజన్‌కు ముందే జట్టు మారే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో యువరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అభిషేక్‌ను ఇప్పుడే టీమిండియా కెప్టెన్‌గా చూడటం తొందరపాటు నిర్ణయమే అయినా.. అతడిలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని యువరాజ్ చెప్పాడు.

ముఖ్యంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)ని అభిషేక్ ప్రోత్సహిస్తున్న తీరును యువరాజ్ ప్రశంసించాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా యువ ఆటగాళ్లకు అండగా నిలుస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాడని చెప్పాడు. సీనియర్ ఆటగాడిగా ఇది మంచి లక్షణమని పేర్కొన్నాడు.

టీమిండియాకు భవిష్యత్‌లో కెప్టెన్ కావాలంటే ముందుగా ఐపీఎల్ జట్టుకు నాయకత్వం వహించడం ఉపయోగపడుతుందని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ కెప్టెన్సీ ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవడం, ఆటగాళ్లను నడిపించడం వంటి అనుభవం వస్తుందని చెప్పాడు. అభిషేక్‌కు ఆ అవకాశం దక్కితే భవిష్యత్‌లో భారత్‌కు నాయకత్వం వహించే అవకాశాలు కూడా ఉండొచ్చని సూచించాడు.

అయితే కెప్టెన్ అవుతాడని ఇప్పుడే చెప్పడం కష్టమని యువరాజ్ స్పష్టం చేశాడు. కెప్టెన్సీ దక్కకపోయినా అభిషేక్ గొప్ప వైట్‌బాల్ క్రికెటర్‌గా ఎదుగుతాడని ధీమా వ్యక్తం చేశాడు.

ఇదే సమయంలో అభిషేక్‌ను వన్డే జట్టులోకి తీసుకోవాలని యువరాజ్ బలంగా సూచించాడు. 71 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. ఇప్పటివరకు భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేయలేదు. అయితే విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉండటంతో పోటీ తీవ్రంగా ఉందని యువరాజ్ అంగీకరించాడు.

అయినా ప్రతిభను నిరూపించుకోవాలంటే అవకాశం ఇవ్వాల్సిందేనని చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ తన ప్రదర్శనతో టీ20 జట్టులో చోటు సంపాదించినట్లే.. అభిషేక్‌కు కూడా 50 ఓవర్ల క్రికెట్‌లో అవకాశం కల్పించాలని యువరాజ్ సూచించాడు. ప్రపంచకప్‌కు ముందు అతడిని వన్డే సెటప్‌లో పరీక్షించడం ఉపయోగకరమని పేర్కొన్నాడు.

ఇక భారత్, న్యూజిలాండ్ (New Zealand) మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ నవంబర్ 1న జరగనుంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ మరోసారి తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us