
Yashasvi Jaiswal: భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. అయితే, అతని ఈ విజయ ప్రస్థానం వెనుక అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న ఒక కీలక నిర్ణయం దాగి ఉంది. సాధారణంగా మ్యాచ్‌కు ఒకరోజు ముందో లేదా టాస్ సమయంలోనో అరంగేట్రం గురించి తెలిసే సంప్రదాయానికి భిన్నంగా, జైస్వాల్‌కు పదిహేను రోజుల ముందే తను ఆడబోతున్నట్లు రోహిత్ చెప్పేశాడు. ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని జైస్వాల్ ఇటీవల వెల్లడించాడు.
వెస్టిండీస్‌తో 2023లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తన తొలి ఇన్నింగ్స్‌లోనే 171 పరుగుల భారీ సెంచరీతో ప్రపంచాన్ని ఆకర్షించిన జైస్వాల్, అంత ఆత్మవిశ్వాసంతో ఆడటానికి రోహిత్ శర్మ ఇచ్చిన క్లారిటీనే ప్రధాన కారణమని చెప్పాడు.
జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. భారత జట్టు వెస్టిండీస్ చేరుకున్న వెంటనే రోహిత్ శర్మ అతనితో మాట్లాడాడు. “నేను నీకు మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు చెప్పి ఒత్తిడికి గురిచేయను. ఇప్పటి నుంచే చెబుతున్నాను.. నువ్వు తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నావు. నిన్ను నువ్వు సిద్ధం చేసుకో” అని పదిహేను రోజుల ముందే రోహిత్ స్పష్టం చేశాడు.
యువ ఆటగాడు తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఎటువంటి ఆందోళన లేకుండా, మానసికంగా, సాంకేతికంగా పరిపూర్ణంగా సిద్ధమవ్వాలనే ఉద్దేశంతోనే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. “మనం కలిసి ప్రాక్టీస్ చేద్దాం, సరైన పద్ధతిలో సిద్ధమవుదాం” అని రోహిత్ భరోసా ఇవ్వడం జైస్వాల్‌లో ఎంతో ధైర్యాన్ని నింపింది.
అరంగేట్రం గురించి చెప్పడమే కాకుండా, రోహిత్ ఒక ముఖ్యమైన సలహా కూడా ఇచ్చాడు. “మైదానంలోకి వెళ్లి నీ సహజసిద్ధమైన ఆటను ఆడాలి. షాట్లు కొట్టడానికి భయపడకు. అయితే, ఒక్కసారి క్రీజులో కుదురుకున్నావంటే మాత్రం దానిని భారీ ఇన్నింగ్స్‌గా మార్చడానికి ప్రయత్నించు” అని రోహిత్ చెప్పిన మాటలను జైస్వాల్ తూచా తప్పకుండా పాటించాడు. ఫలితంగానే డొమినికా టెస్టులో అతను 171 పరుగులు చేయగలిగాడు.
రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. అతను తనకు ఒక అన్నయ్య లాంటివాడని, ఎప్పుడూ స్ఫూర్తినిస్తూ కొత్త విషయాలు నేర్పిస్తుంటాడని జైస్వాల్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టమని, వారు ఆటను ఎంత సీరియస్‌గా తీసుకుంటారో గమనించడం ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని ఈ యువ ఓపెనర్ ఆనందం వ్యక్తం చేశాడు.
రోహిత్ శర్మ అందించిన ఆ పదిహేను రోజుల సమయం జైస్వాల్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇప్పుడు జైస్వాల్ భారత టెస్ట్ జట్టులో అత్యంత నమ్మదగ్గ ఓపెనర్‌గా ఎదగడం వెనుక హిట్‌మ్యాన్ దార్శనికత స్పష్టంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..