డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత ఆటగాళ్లు పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. తొలి రోజుతో పోలిస్తే.. రెండు రోజు బౌలింగ్ మెరుగైనప్పటికీ.. ఆస్ట్రేలియాను మాత్రం భారీ స్కోర్ చేయకుండా ఆపలేకపోయారు. బంతితో తేలిపోయినా.. బ్యాట్‌తో అయినా మనోళ్లు సత్తా చాటుతారని ఆశిస్తే.. కష్టపడి కొన్ని రన్స్ చేసిన కొద్దిసేపటికే పెవిలియన్ చేరుకున్నారు. ఇలా తొలి రోజు బౌలర్లు, రెండో రోజు బ్యాటర్లు తేలిపోయారు. భారత్ ప్లేయర్స్‌కు ఇంకా ఐపీఎల్ మత్తు వీడలేదంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులు భారీ స్కోర్ చేయగా.. అనంతరం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. ఆట ముగిసే సమయానికి 151/5తో నిలిచింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఒకదశలో 71/4తో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడగా.. ఆ సమయంలో రవీంద్ర జడేజా(48), అజింక్య రహనే(29) జట్టును ఆదుకున్నారు. కానీ చివర్లో జడేజాను ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా లయోన్ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఆట చివరికి రహనే(29*)కు తోడుగా ఆంధ్రా ప్లేయర్ శ్రీకర్ భారత్ (5*) క్రీజులో ఉన్నాడు. భారత్ ఫాలోఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే.. మరో 118 పరుగులు చేయాల్సి ఉంది.
అంతకుముందు 327/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్.. మరో 142 పరుగులు జోడించి.. చివరి 7 వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్(163), స్టీవెన్ స్మిత్(121) సెంచరీలకు తోడుగా అలెక్స్ క్యారీ(48) విలువైన ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాను పటిష్ట స్థితిలో నిలబెట్టాయి. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు.