WTC Final Scenario : ఇంగ్లాండ్ పని ఖతం..భారత్‌కు ఇంకా మిగిలి ఉన్న ఛాన్స్..డబ్ల్యూటీసీ ఫైనల్ లెక్కలివే

WTC Final Scenario : ప్రస్తుతం ఐసీసీ విడుదల చేసిన తాజా పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిక్యంలో ఉంది. ఆడిన 8 టెస్టుల్లో 7 గెలిచి 87.50 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ (77.78%), సౌతాఫ్రికా (75%) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

WTC Final Scenario : ఇంగ్లాండ్ పని ఖతం..భారత్‌కు ఇంకా మిగిలి ఉన్న ఛాన్స్..డబ్ల్యూటీసీ ఫైనల్ లెక్కలివే
Wtc Final Scenario

Updated on: Jan 08, 2026 | 5:17 PM

WTC Final Scenario : యాషెస్ సిరీస్ ముగియడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఈక్వేషన్స్ ఆసక్తికరంగా మారాయి. ఇంగ్లాండ్‌ను వారి గడ్డపైనే 4-1తో చిత్తు చేసిన ఆస్ట్రేలియా, 2027 ఫైనల్ రేసులో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న టీమ్ ఇండియా కథ ఇంకా ముగిసిపోలేదు. ఇంగ్లాండ్ ఓటమి భారత్‌కు ఒక రకంగా కలిసొచ్చిందనే చెప్పాలి. మరి టీమిండియా వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే ఏం చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ప్రస్తుతం ఐసీసీ విడుదల చేసిన తాజా పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిక్యంలో ఉంది. ఆడిన 8 టెస్టుల్లో 7 గెలిచి 87.50 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ (77.78%), సౌతాఫ్రికా (75%) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్ ప్రస్తుతం 48.15 శాతంతో ఆరో స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ 31.67 శాతంతో ఏడో స్థానానికి పడిపోయింది. పట్టికలో కింద ఉన్నట్లు కనిపిస్తున్నా, భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు ఎక్కువగా ఉండటం మనకు కలిసొచ్చే అంశం.

2027లో జరిగే ఫైనల్‌కు టాప్-2 జట్లు మాత్రమే అర్హత సాధిస్తాయి. భారత్ చేతిలో ఇంకా 9 టెస్టులు ఉన్నాయి. 2026లో శ్రీలంకలో 2 టెస్టులు, న్యూజిలాండ్‌లో 2 టెస్టులు ఆడి, ఆ తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 5 టెస్టుల భారీ సిరీస్ ఆడాల్సి ఉంది. భారత్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే ఈ 9 మ్యాచ్‌ల్లో కనీసం 7 లేదా 8 విజయాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మొత్తం 9 మ్యాచ్‌లు గెలిస్తే, భారత్ పీసీటీ 74.07 శాతానికి చేరుతుంది. అప్పుడు ఎవరితోనూ సంబంధం లేకుండా నేరుగా ఫైనల్ చేరుకోవచ్చు.

విదేశీ గడ్డపై జరిగే మ్యాచ్‌లే భారత్‌కు అత్యంత కీలకం. శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనల్లో డ్రా కోసం ప్రయత్నించకుండా విజయాలే లక్ష్యంగా బరిలోకి దిగాలి. అక్కడ కనీసం 3 మ్యాచ్‌లు గెలిచి, ఆ తర్వాత భారత్‌లో జరిగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 4-1 లేదా 5-0తో ఓడిస్తే భారత్ పాయింట్ల శాతం 65 పైచిలుకు చేరుతుంది. ఈ ఈక్వేషన్ ఉంటే టాప్-2లో చోటు దక్కించుకోవడం సులభమవుతుంది.

భారత్ తన సొంత ప్రదర్శనతో పాటు ఇతర జట్ల ఓటములపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా పట్టికలో పైన ఉన్న న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు ఆడాల్సిన మ్యాచ్‌లు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ అవి ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినా వాటి శాతం పడిపోతుంది. అలాగే భారత్ తన సొంత గడ్డపై ఆస్ట్రేలియాను భారీ తేడాతో ఓడిస్తే, ఆసీస్ పాయింట్ల శాతం కూడా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల భారత్ మెరుగైన స్థానానికి చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.