WTC final 2027 : క్రికెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. లార్డ్స్ మైదానం నుంచి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మార్పు

WTC final 2027 : డబ్ల్యూటీసీ 2027 ఫైనల్‌ను లార్డ్స్ నుంచి ది ఓవల్‌కు మార్చే దిశగా ఐసీసీ ఆలోచిస్తోంది. లార్డ్స్ పిచ్‌కు అన్‌శాటిస్‌ఫాక్టరీ రేటింగ్, డీమెరిట్ పాయింట్ రావడంతో ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల పరిస్థితి కూడా పాయింట్ల పట్టికలో ఆసక్తికరంగా మారింది.

WTC final 2027 : క్రికెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..  లార్డ్స్ మైదానం నుంచి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మార్పు
Wtc Final 2027

Updated on: Jun 21, 2026 | 1:57 PM

WTC final 2027 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2027 ఫైనల్ మ్యాచ్ వేదికపై ఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ లండన్ లోని లార్డ్స్ మైదానంలో జరగాల్సి ఉంది. అయితే, ఇటీవల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య లార్డ్స్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ కేవలం 166 ఓవర్లలోనే (రెండు రోజులు కూడా పూర్తిగా అవ్వకుండా) ముగిసిపోయింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేయడం ఆటగాళ్లకు నరకంగా మారింది. ఈ పిచ్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ, దీనికి అన్‌శాటిస్‌ఫాక్టరీ రేటింగ్ ఇవ్వడమే కాకుండా లార్డ్స్ చరిత్రలోనే మొదటిసారి ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా విధించింది.

ది ఓవల్ మైదానానికి మారనున్న ఫైనల్ వేదిక

టెస్ట్ క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ గా భావించే డబ్ల్యూటీసీ ఫైనల్ ఐదు రోజుల పాటు బ్యాట్ కు, బాల్ కు మధ్య సమానమైన పోటీని ఇచ్చేలా ఉండాలని ఐసీసీ కోరుకుంటోంది. లార్డ్స్ పిచ్ పై అస్థిరమైన బౌన్స్, విపరీతమైన సీమ్ మూవ్‌మెంట్ కారణంగా కేవలం రెండు రోజుల్లోనే 40 వికెట్లు పడిపోయాయి. ఇందులో 24 వికెట్లు ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్డ్ రూపంలోనే వచ్చాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను ఐదు రోజుల పాటు విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా 2027 ఫైనల్ వేదికను లండన్‌లోని ది ఓవల్ మైదానానికి మార్చాలని నివేదికలు చెబుతున్నాయి. గతంలో 2023 ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే విజయవంతంగా జరిగింది.

విమర్శలను అంగీకరించిన మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్

లార్డ్స్ మైదానానికి యజమాని అయిన మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC), పిచ్‌పై వస్తున్న విమర్శలను అంగీకరించింది. అయితే, లార్డ్స్ లో అంతకుముందు జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ల పిచ్‌లకు మంచి రేటింగ్‌లు వచ్చాయని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం విపరీతమైన అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా పిచ్‌లను పర్ఫెక్ట్ గా సిద్ధం చేయడం క్యూరేటర్లకు పెద్ద సవాలుగా మారిందని ఎంసీసీ క్రికెట్ డైరెక్టర్ రాబ్ లించ్ పేర్కొన్నారు. 2027 డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణకు ఇంకా 12 నెలల సమయం ఉన్నందున, వేదిక మార్పుపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB), ఐసీసీ కలిసి తుది నిర్ణయం తీసుకోనున్నాయి.

డబ్ల్యూటీసీ 2027 పాయింట్ల పట్టికలో జట్ల పరిస్థితి

ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2025-27) పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా, డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా జట్లు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 87.50 పీసీటీతో టేబుల్ టాపర్‌గా ఉండగా, సౌతాఫ్రికా 75 పీసీటీతో రెండో స్థానంలో ఉంది. అయితే సౌతాఫ్రికా ఇప్పటివరకు కేవలం 4 టెస్టులు మాత్రమే ఆడగా, ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌లు ఆడింది. కాబట్టి టెంబా బవుమా నేతృత్వంలోని ప్రోటీస్ జట్టుకు తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

భారత్, ఇంగ్లాండ్ జట్లకు ఎదురుదెబ్బ

మరోవైపు, గత రెండు ఎడిషన్లలో రన్నరప్‌గా నిలిచిన టీమిండియాకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. అటు ఇంగ్లాండ్ జట్టు కూడా 11 టెస్టుల్లో కేవలం 4 గెలిచి ఏడో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ రెండు జట్లు 2027 ఫైనల్‌కు అర్హత సాధించాలంటే రాబోయే సిరీస్‌లలో అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ ది ఓవల్‎కు మారినా కూడా.. లండన్ లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ ఆడే సాధారణ టెస్ట్ మ్యాచ్‌లు యథావిధిగా జరుగుతాయని సమాచారం.

 

Follow Us