
WPL 2026 Auction : మహిళా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలం కోసం తెర లేచింది. ఈసారి జరగబోయే నాలుగో ఎడిషన్ టోర్నమెంట్‌కు సంబంధించిన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఈ మెగా ఆక్షన్ నవంబర్ 27, 2025న న్యూఢిల్లీలో జరగనుంది. మొత్తం 73 ఖాళీ స్లాట్‌లను భర్తీ చేయడానికి 277 మంది ఆటగాళ్లు ఈ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.
డబ్ల్యూపీఎల్ 2026 వేలం జాబితాలో మొత్తం 277 మంది ప్లేయర్లు ఉన్నారు. ఇందులో భారతీయ ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లు ఇద్దరూ ఉన్నారు. భారతదేశం నుంచి మొత్తం 194 మంది ప్లేయర్లు ఉన్నారు. వీరిలో జాతీయ జట్టుకు ఆడినవారు (క్యాప్డ్) 52 మంది కాగా, ఇంకా అవకాశం రానివారు (అన్‌క్యాప్డ్) 142 మంది ఉన్నారు. వీరికి 50 స్లాట్లు కేటాయించారు. ఇక విదేశీ ప్లేయర్లు మొత్తం 83 మంది ఉన్నారు. ఇందులో 66 మంది క్యాప్డ్, 17 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరి కోసం 23 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో ఆటగాళ్లకు నిర్ధారించిన అత్యధిక బేస్ ప్రైజ్ రూ.50 లక్షలుగా ఉంది. ఈ అత్యధిక బేస్ ప్రైజ్‌లో ఏకంగా 19 మంది స్టార్ ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరితో పాటు రూ.40 లక్షల బేస్ ప్రైజ్‌తో 11 మంది, రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో 88 మంది ప్లేయర్లు ఉన్నారు. అంటే వేలంలో ఈ టాప్ ప్లేయర్స్ కోసం ఫ్రాంఛైజీల మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది.
వేలం ప్రక్రియ మార్కీ సెట్‌తో ప్రారంభమవుతుంది. ఈ మొదటి సెట్‌లో మొత్తం 8 మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇందులో భారత స్టార్స్ అయిన దీప్తి శర్మ, రేణుకా సింగ్‌తో పాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. విదేశీ ప్లేయర్లలో సోఫీ డివైన్ (న్యూజిలాండ్), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), అలీసా హీలీ (ఆస్ట్రేలియా), అమేలియా కెర్ (న్యూజిలాండ్), మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), లౌరా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా) వంటి దిగ్గజాలు ఉన్నారు. వేలం మొదటి దశలోనే ఈ స్టార్ ఆటగాళ్లపై ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది.
డబ్ల్యూపీఎల్ 2026 టోర్నమెంట్ నాలుగవ ఎడిషన్. ఈ టోర్నమెంట్ జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనుంది. ఈ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ అనే మొత్తం 5 జట్లు పాల్గొంటాయి. గతంలో జరిగిన 3 ఎడిషన్లలో ముంబై ఇండియన్స్ 2 సార్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1 సారి విజేతగా నిలిచాయి. ఈసారి కొత్త ఛాంపియన్ వస్తుందా లేదా పాత జట్లే టైటిల్‌ను నిలబెట్టుకుంటాయా అనేది చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..