
Richa Ghosh : మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 విజయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రిచా ఘోష్ కీలకపాత్ర పోషించింది. లీగ్ దశలో దక్షిణాఫ్రికాపై ఆమె 94 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఫైనల్‌లో కూడా 34 పరుగులు చేసి జట్టు విజయంలో భాగమైంది. భారత్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఏర్పాటు చేసిన సన్మాన సభలో రిచా ఘోష్‌కు డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) పదవిని ప్రకటించారు. తాజాగా ఆమె ఈ పదవిని స్వీకరించి, రాష్ట్ర పోలీసు బలగంలో చేరింది.
సిలిగురిలో ACPగా పోస్టింగ్
వరల్డ్ కప్ విజేత జట్టులో భాగమైన రిచా ఘోష్, డీఎస్పీ ర్యాంక్‌తో రాష్ట్ర పోలీసు బలగంలో చేరింది. ఆమె తన సొంత జిల్లా అయిన పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె సిలిగురి పోలీస్ కమిషనరేట్‌లోని సీనియర్ అధికారులు, ఇతర సభ్యులను కలుసుకుంది. ఈ సందర్భంగా ఆమెను క్యాబ్ సంస్థ రూ.34 లక్షల నగదు బహుమతితో సత్కరించింది. డీఎస్పీగా రిచా ఘోష్‌కు పోలీస్ బృందాలకు నాయకత్వం వహించడం, శాంతిభద్రతల నిర్వహణ, నేర నియంత్రణ, వివిధ పరిపాలనా పనులను పర్యవేక్షించడం వంటి బాధ్యతలు ఉంటాయి. డీఎస్పీగా ఆమె బేసిక్ పే సుమారు రూ.56,100 కాగా, దీనికి అనేక ఇతర అలవెన్స్‌లు తోడై జీతం పెరుగుతుంది.
ACP RICHA GHOSH HAS TAKEN CHARGE…!!!! 🔥 pic.twitter.com/VlHzSIkc5t
— Johns. (@CricCrazyJohns) December 5, 2025
సిరాజ్ ర్యాంకుతో సమానం
రిచా ఘోష్ (22) పశ్చిమ బెంగాల్‌లో డీఎస్పీగా సిలిగురిలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ACP) పదవిని చేపట్టింది. ఇదే ర్యాంకును భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా తెలంగాణ పోలీసులో డీఎస్పీగా కలిగి ఉన్నాడు. ACP, DSP ర్యాంకులు సమానమైనవి, రెండూ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులే. సిలిగురిలో జన్మించిన రిచా, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఆమె ఇప్పటివరకు భారత్ తరఫున 2 టెస్టులు, 51 వన్డేలు, 67 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడింది.