
మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ గట్టి పోటీదారేమీ కాదు. అయితే ఈ జట్టును పసికూనగా అని తేలికంగా తీసుకుంటే మాత్రం నూకలు చెల్లించాల్సిందే. ఎందుకంటే ఈ జట్టు ఛాంపియన్‌గా మారలేకపోవచ్చు కానీ తనదైన రోజున ఎలాంటి జట్లనైనా ఓడిస్తుంది. గతంలో ఇది చాలా సార్లు నిరూపితమైంది. పైగా గతంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు ఆ టీమ్ లో 6 నుండి 7 మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ విభాగం ప్రపంచంలోని ఏ బ్యాటర్లనైనా ముప్పతిప్పలు పెట్టగలదు. ప్రపంచ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 7న ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది అఫ్ఘానిస్థాన్. మరి ఈ జట్టు బలాలు, బలహీనతల ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్‌ను కూడా తెలుసుకుందాం రండి. బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ బ్యాలెన్స్ ఆఫ్ఘనిస్తాన్ అతిపెద్ద బలం. హష్మతుల్లా షాహిదీ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అతనికి తోడుగా బ్యాటింగ్, బౌలింగ్‌లో పెద్ద మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. టాప్ ఆర్డర్‌లో రెహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ వంటి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. వీరు వేగంగా పరుగులు చేయడంలో దిట్ట. మిడిలార్డర్‌లో నజీబుల్లా జద్రాన్ లాంటి అద్భుతమైన ఆటగాడు ఉన్నాడు. ఆల్‌రౌండర్‌లలో మహ్మద్ నబీ ఆ జట్టుకు అదనపు బలం. బంతితోనూ, బ్యాటింగ్‌తోనూ మ్యాచ్‌లను గెలిపించగల శక్తి అతనికి ఉంది.
నలుగురు అత్యుత్తమ స్పిన్నర్లు ఆఫ్ఘనిస్తాన్‌కు వెన్నెముక. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌లలో ఒకరిగా రషీద్ ఖాన్‌కు పేరుంది. అతనితో పాటు ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ కూడా ఈ జట్టులో ఉన్నారు. నూర్ అహ్మద్ ఒక చైనామన్ బౌలర్, అతను ప్రపంచంలోని ఏ బ్యాటర్‌కైనా ఇక్కట్లు సృష్టించగలదు. ఆఫ్ఘనిస్థాన్ పేస్ బౌలింగ్ ఎటాక్ కూడా తక్కువేమీ కాదు. జట్టులో ఫజల్‌హక్ ఫరూఖీ వంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు. నవీన్ ఉల్ హక్ అతనికి బాగా మద్దతు ఇస్తున్నాడు. స్లో బంతులతో బ్యాటర్లను ఇట్టే బోల్తా కొట్టించడంలో నవీన్ ఉల్ హక్ దిట్ట.
అక్టోబరు 23న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరగడం విశేషం. అక్కడి పిచ్ స్పిన్‌కు అనుకూలమైనది. ఇది ఆఫ్ఘన్‌ల బలం కాబట్టి చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్‌ను ఓడించే అవకాశం ఉంది. స్పిన్ దాడితో పాకిస్థాన్‌పై అటాక్ చేయవచ్చు. పైగా పాక్ జట్టులో సామర్థ్యమున్న స్పిన్నర్లు లేరు. గత 7 ODI మ్యాచ్‌లలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. అయితే భారతదేశంలో జరిగే ప్రపంచ కప్‌లో అఫ్గాన్‌ను ఓడించడం బాబర్ టీమ్‌కు అంత సులభమేమీ కాదు.
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్ హమాన్, నవీన్ ఉల్ హక్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..