
SA vs BAN : మహిళల ప్రపంచ కప్ 2025లో అక్టోబర్ 13న వైజాగ్ వేదికగా బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్కంఠను పంచింది. ఒకానొక దశలో మ్యాచ్ పూర్తిగా బంగ్లాదేశ్ పట్టులోకి వెళ్లిపోయింది. సౌతాఫ్రికా ఓటమి ఖాయం అనిపించింది. కానీ, క్రికెట్‌లో చివరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం అన్నట్టుగానే, దక్షిణాఫ్రికా చివరి ఓవర్ వరకు పోరాడి, బంగ్లాదేశ్ చేతి నుంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున షోర్నా అక్తర్ అత్యధికంగా 51 పరుగులు చేసింది. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో సౌతాఫ్రికా ముందు గెలవడానికి 233 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని సౌతాఫ్రికా మరో 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సంచలనం సృష్టించింది. ఈ ప్రపంచ కప్‌లో సౌతాఫ్రికా ఇలా చివరి నిమిషంలో గెలవడం ఇది వరుసగా రెండో మ్యాచ్ కావడం విశేషం.
సౌతాఫ్రికా విజయంపై ఆశ్చర్యం కలగడానికి కారణం లేకపోలేదు. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు కేవలం 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అంటే, సగం టీమ్ పెవిలియన్‌కు చేరుకుంది. సరిగ్గా గత మ్యాచ్‌లో భారత్‌పై కూడా సౌతాఫ్రికా ఇలాగే పోరాడింది. అప్పుడు 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు ఆ జట్టు 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అంటే బంగ్లాదేశ్, భారత్.. ఈ రెండు జట్ల నుంచి కూడా చివరి క్షణంలో విజయాన్ని లాగేసుకుని సఫారీలు తమ పోరాట పటిమను చాటారు.
సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ తమ ఇన్నింగ్స్‌లో మొత్తం 166 బంతులను డాట్ బాల్స్ (0 పరుగులు) ఆడారు. అంటే, బంగ్లాదేశ్ బౌలర్లు తమ మొత్తం ఓవర్లలో 166 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఇంత డాట్ బాల్స్ ఆడి, కేవలం 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా సౌతాఫ్రికా గెలవడం ఒక అద్భుతం. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొత్తం ఏడుగురు బౌలర్లను ప్రయత్నించింది.
అయితే, 166 డాట్ బాల్స్‌కు, 5 వికెట్ల పతనానికి తర్వాత కూడా సౌతాఫ్రికా గెలిచిందంటే, దానికి ప్రధాన కారణం గత మ్యాచ్‌లో భారత్ నుంచి విజయాన్ని లాగేసుకున్న క్లో ట్రయాన్, నాడిన్ డి క్లర్క్ జోడీనే. క్లో ట్రయాన్ మెరుపు వేగంతో 62 పరుగులు చేసింది. ముఖ్యంగా, ఆమె, మరిజానే కాప్(56 రన్స్) భాగస్వామ్యం టాప్ ఆర్డర్ వైఫల్యం నుంచి జట్టును బయటపడేసింది. ఇక, నాడిన్ డి క్లర్క్ 29 బంతుల్లో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, జట్టును విజయతీరాలకు చేర్చింది. తన అద్భుతమైన ప్రదర్శనకు క్లో ట్రయాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..