
Womens T20 World Cup : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో ఒక భారీ అంచనాల మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుకు శ్రీలంక మహిళల జట్టు గట్టి షాక్ ఇచ్చింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ పోరులో శ్రీలంక 5 వికెట్ల తేడాతో కివీస్‌ను మట్టికరిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులు చేయగా.. శ్రీలంక జట్టు మరో 2 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే న్యూజిలాండ్ జట్టుపై శ్రీలంక విజయం సాధించడం ఇదే తొలిసారి కావడంతో ఈ గెలుపు చరిత్రలో నిలిచిపోనుంది.
ఈ ఓటమితో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ ఆశలు గాల్లో దీపంగా మారాయి. టోర్నమెంట్‌లో వరుసగా దెబ్బతింటున్న కివీస్ జట్టు గ్రూప్-బి పాయింట్ల పట్టికలో ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్ కంటే ముందు వెస్టిండీస్ జట్టు కూడా న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించింది. మరోవైపు, శ్రీలంక జట్టుకు ఈ టోర్నీలో ఇదే మొదటి విజయం. తన మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో 87 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన లంక లేడీస్.. ఈ మ్యాచ్‌లో మాత్రం అద్భుత కంబ్యాక్ ఇచ్చి తామేంటో నిరూపించుకున్నారు.
151 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు చామరి ఆటపట్టు (27 పరుగులు), విష్మి గుణరత్నే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు వీరిద్దరు 45 పరుగులు జోడించారు. అయితే వేగంగా ఆడుతున్న కెప్టెన్ ఆటపట్టు అవుట్ కాగానే లంక ఇన్నింగ్స్ తడబడింది. చూస్తూ చూస్తూనే 9 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక జట్టు కేవలం 55 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. కివీస్ విజయం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన 36 ఏళ్ల సీనియర్ ప్లేయర్ నిలాక్షిక డి సిల్వా మ్యాచ్ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది.
క్రీజులోకి వస్తూనే నిలాక్షిక కివీస్ బౌలర్లపై విరుచుకుపడింది. ఆమె కవిషా దిల్హారితో కలిసి కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇందులో నిలాక్షిక ఒక్కరే 32 పరుగులు జోడించడం విశేషం. కేవలం 33 బంతుల్లోనే ఆమె తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే 15వ ఓవర్లో కవిషా అవుట్ కావడంతో లంకపై మళ్లీ ఒత్తిడి పెరిగింది. కానీ ఈ దశలో వికెట్ కీపర్ కౌషాని నుత్తయాంగన అండగా నిలిచింది. కౌషాని కేవలం 14 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. నిలాక్షిక 37 బంతుల్లో 54 పరుగులతో అజేయంగా నిలిచి, వీరిద్దరూ కలిసి కేవలం 28 బంతుల్లో 48 పరుగుల భాగస్వామ్యంతో లంకకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ అమేలియా కెర్, సీనియర్ ప్లేయర్ సోఫీ డివైన్ చెరో 45 పరుగులు చేసి జట్టు స్కోరును 150 పరుగులకు చేర్చారు. అయితే మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. లంక బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా కివీస్ అనుకున్నంత భారీ స్కోరు సాధించలేకపోయింది. లంక బౌలర్లలో కవిషా దిల్హారి 2 వికెట్లు పడగొట్టగా.. మిథాలి అయోధ్య 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. కెప్టెన్ ఆటపట్టు, సుగంధిక, నిమాషా మీపగేలకు తలో వికెట్ దక్కింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..