
Ben Stokes IPL 2027: ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కోట్లాది మంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు. నాటింగ్‌హామ్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన అంతర్జాతీయ వేదికలపై కనిపించరు. ఈ నేపథ్యంలో, 2027 ఐపీఎల్ సీజన్‌లో స్టోక్స్ బరిలోకి దిగుతారా లేదా అనే అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది.
ఇంగ్లాండ్ క్రికెట్‌లో అత్యంత కీలకమైన ఆటగాడిగా పేరొందిన బెన్ స్టోక్స్ గత కొన్ని వారాలుగా నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ నెల ఆరంభంలో గస్ అట్కిన్సన్‌తో కలిసి నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకోవడం వల్ల ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విచారణ చేపట్టి, న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు వీరిద్దరినీ దూరం పెట్టింది. అయితే ఆ తర్వాత విచారణలో క్లీన్ చిట్ రావడంతో, నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ కోసం స్టోక్స్ జట్టులోకి కెప్టెన్‌గా పునరాగమనం చేశారు.
కానీ, మూడో రోజు ఆట సాగుతుండగానే ఈసీబీ సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న బెన్ స్టోక్స్ కనీసం తదుపరి యాషెస్ సిరీస్ వరకైనా ఆడతారని అంతా భావించారు. కానీ తన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మైదానంలో పరుగు తీయడానికి, వికెట్లు పడగొట్టడానికి గతంలో ఉన్నంత కసి, ఆకలి ఇప్పుడు తనలో లేవని ఆయన అంగీకరించారు. గత కొన్ని నెలలుగా శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసిపోయానని, లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించడం ప్రారంభించానని స్టోక్స్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.
నాటింగ్‌హామ్ టెస్ట్ నాల్గో రోజు టీ విరామానికి ముందు ఈసీబీ అధికారిక ప్రకటన చేసినప్పుడు, స్టోక్స్ తన సుదీర్ఘ స్పెల్‌లో 10వ ఓవర్ పూర్తి చేశారు. ఆ తర్వాత 11వ ఓవర్ వేయడానికి ఆయన మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లతో ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాతి బంతికే జాక్ ఫాల్క్స్‌ను స్లిప్‌లో క్యాచ్ అవుట్ చేసి స్టోక్స్ తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానున్నప్పటికీ, డర్హామ్ కౌంటీ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ తో పాటు వివిధ ప్రపంచ లీగ్‌లలో ఫ్రాంచైజీ క్రికెట్ ఆడతానని స్టోక్స్ స్పష్టం చేశారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ అయిన ఐపీఎల్ 2027 సీజన్‌లో ఆయన కనిపిస్తారా లేదా అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. ఏ జట్టుకైనా మ్యాచ్ విన్నర్‌గా మారగల సామర్థ్యం ఉన్న స్టోక్స్‌ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఆయన వచ్చే సీజన్ ఆడటం అసాధ్యంగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. పోతూపోతూ ప్రపంచ రికార్డుతో గర్జించిన పాక్ ప్లేయర్..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విదేశీ ఆటగాళ్ల కోసం ఒక కఠినమైన నిబంధనను తీసుకువచ్చింది. దీని ప్రకారం, ఏ విదేశీ ఆటగాడైనా మెగా వేలంలో (Mega Auction) తన పేరును నమోదు చేసుకోకపోతే, ఆ తర్వాత జరిగే రెండు మినీ వేలాల్లో (Mini Auction) పాల్గొనే అర్హతను కోల్పోతారు. బెన్ స్టోక్స్ చివరిసారిగా 2023లో ఐపీఎల్ ఆడారు. ఆ తర్వాత 2024 సీజన్ నుంచి వైదొలిగాడు. అలాగే, 2025 సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో కూడా ఆయన తన పేరును నమోదు చేసుకోలేదు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం, మెగా వేలాన్ని దాటవేసినందున ఆయనకు 2027 మినీ వేలంలో పాల్గొనే అవకాశం దక్కదు. కాబట్టి స్టోక్స్ మళ్లీ ఐపీఎల్ బరిలోకి దిగాలంటే, నేరుగా 2028లో జరిగే తదుపరి మెగా వేలం వరకు వేచి చూడాల్సిందే. అప్పుడు ఏదైనా జట్టు ఆయనను కొనుగోలు చేస్తేనే మళ్లీ ఐపీఎల్ మైదానంలో చూడగలం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..