
మనం షాపింగ్ మాల్‌కి వెళ్లినా, ఆన్‌లైన్ లో వస్తువులు వెతికినా 99, 999, 9999 అనే ధరలే దర్శనమిస్తాయి. ఒక రూపాయి తక్కువ చేసి ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కేవలం రూపాయి వ్యత్యాసమే కాదు, మిమ్మల్ని ఆకర్షించి మీతో కొనిపించే ఒక పెద్ద వ్యాపార సైకాలజీ దాగి ఉంది. ఈ మార్కెటింగ్ తంత్రం మిమ్మల్ని ఎలా మాయ చేస్తుందో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు.
సూపర్ మార్కెట్ లేదా ఆన్‌లైన్ స్టోర్ తెరిస్తే చాలు ఒక రూపాయి తగ్గించి రాసిన బోర్డులు మనల్ని ఆకర్షిస్తాయి. చాలామంది దీన్ని సాధారణ విషయంగా లేదా ఏదో ఆఫర్ గా భావిస్తుంటారు. కొన్నిసార్లు దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా చూస్తుంటాం. ఒక రూపాయి తగ్గిస్తే వ్యాపారులకు వచ్చే నష్టం ఏమీ ఉండదు, కానీ కొనుగోలుదారుల మెదడుపై అది చూపే ప్రభావం చాలా పెద్దది. సాధారణ వినియోగదారుడు ఊహించలేనంత పెద్ద సైకాలజీ దీని వెనుక దాగుంది.
మానవ మెదడు ఏదైనా సంఖ్యను చూసినప్పుడు ఎడమ వైపు ఉన్న మొదటి అంకెను మాత్రమే ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. శాస్త్రవేత్తలు దీన్ని ‘లేఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్’ అని పిలుస్తారు. ఉదాహరణకు ఒక వస్తువు ధర 1000 రూపాయలు అని ఉంటే అది నాలుగు అంకెల పెద్ద మొత్తంగా కనిపిస్తుంది. అదే 999 రూపాయలు అని రాస్తే మన మైండ్ దాన్ని 900 కి దగ్గరగా ఉందే తప్ప 1000 కి చేరువులో ఉందని అనుకోదు. నిజానికి అక్కడ తేడా కేవలం ఒక్క రూపాయి మాత్రమే. తక్కువ ధరకే వస్తువు లభిస్తోందనే భ్రమను క్రియేట్ చేసి మీ చేత జేబు ఖాళీ చేయించడమే ఈ ట్రిక్ అసలు ఉద్దేశం.
పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి 1500 రూపాయల వస్తువు కేవలం 999 రూపాయలకే అని రాసినప్పుడు మన మనసు వెంటనే దాన్ని కొనాలని తపిస్తుంది. 50 శాతం ఆఫర్, 20 శాతం తగ్గింపు అనే పదాలు మనలో సేవింగ్స్ చేస్తున్నామనే తృప్తిని కలిగిస్తాయి. నాలుగు అంకెల ధర మూడు అంకెలుగా మారగానే ఏదో పెద్దమొత్తంలో డబ్బు ఆదా అయిపోయిందనే సంతోషం కలుగుతుంది. వినియోగదారుడి బలహీనతలను ఆసరాగా చేసుకుని విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు వాడే అద్భుతమైన అస్త్రం ఇది.
సాధారణంగా కొనుగోలు పూర్తయ్యాక ఆ ఒక్క రూపాయి చిల్లరను చాలామంది కస్టమర్లు తిరిగి అడగరు. సంకోచంతోనో లేక సమయం వృధా ఎందుకనో వదిలేస్తుంటారు. వినియోగదారుడికి ఆ ఒక్క రూపాయి చిన్నదిగా అనిపించవచ్చు. వేల మంది కస్టమర్ల దగ్గర ఇలాగే మిగిలిపోయే ఆ ఒక్క రూపాయి వ్యాపారులకు రోజు చివరికి వచ్చేసరికి భారీ లాభంగా మారుతుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..