“ఎల్‌ క్లాసికో” అంటే ఏంటి? CSK vs MI మ్యాచ్‌ను ఎందుకు ఎల్‌ క్లాసికో అని పిలుస్తున్నారు? పూర్తి వివరాలు

|

Mar 24, 2025 | 1:49 PM

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్‌ను "ఎల్ క్లాసికో" అని ఎందుకు పిలుస్తారో ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఫుట్‌బాల్‌లోని రియల్ మాడ్రిడ్, బార్సిలోనా జట్ల మధ్య పోటీని పోలి ఉండటం దీనికి కారణం. రెండు జట్లకూ విశాలమైన అభిమానవర్గం ఉండటం, వాటి మధ్య ఉన్న తీవ్రమైన పోటీ ఈ పేరుకు కారణం.

ఎల్‌ క్లాసికో అంటే ఏంటి? CSK vs MI మ్యాచ్‌ను ఎందుకు ఎల్‌ క్లాసికో అని పిలుస్తున్నారు? పూర్తి వివరాలు
Csk Vs Mi
Follow us on

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు చెపాక్‌ స్టేడియం వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. ముందుగా నూర్‌ అహ్మద్‌ ముంబై బ్యాటర్లను చుట్టేశాడు. 156 పరుగుల సింపుల్‌ టార్గెట్‌ను సీఎస్‌కే ఆడుతూ పాడుతూ ఛేజ్‌ చేసింది. ఓపెనర్‌ రచిన్‌ రవీంద్రా, కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ హాఫ్‌ సెంచరీలతో రాణించారు. మధ్యలో ముంబై యువ బౌలర్‌ విగ్నేస్‌ పుతుర్‌ కాస్త ఇబ్బంది పెట్టినా.. సీఎస్‌కే గెలుపును ఆపలేకపోయాడు. అయితే.. ఈ సీఎస్‌కే వర్సెస్‌ ఎంఐ మ్యాచ్‌ను చాలా మంది ఎల్‌ క్లాసికో అని పిలుస్తున్నారు. అసలింతకీ ఈ ఎల్‌ క్లాసికో అంటే ఏంటి? ఎందుకని సీఎస్‌కే వర్సెస్‌ ఎంఐ మ్యాచ్‌నే ఎల్‌ క్లాసికో అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్‌ క్లాసికో అనేది ఒక స్పానిష్‌ పదం. దీన్నే ఎల్‌ క్లాసిక్‌ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్‌లో ది క్లాసిక్‌ అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌ బాల్‌కు చాలా క్రేజ్‌ ఉంది. మన దేశంలో క్రికెట్‌ అంటే ఎలా పడిచస్తామో.. చాలా దేశాల్లో ఫుట్‌బాల్‌ అంటే పడిచస్తారు. రియల్‌ మాడ్రిడ్‌, బార్సిలోనా క్లబ్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ఎల్‌ క్లాసికో అని పిలుస్తుంటారు. ఈ రెండు జట్ల మధ్య పోటీ భీకరంగా ఉంటుంది. పైగా ఈ రెండు క్లబ్‌ జట్ల మ్యాచ్‌ చూసేందుకు ఫుట్‌బాల్‌ అభిమానులు విపరీతమైన ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే.. ఈ రెండు జట్లు కేవలం వాటి క్లబ్‌లనే కాకుండా ప్రత్యేకమైన భావజాలం కలిగి ఉన్నాయి. రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌ స్పానిష్‌ జాతీయవాదాన్ని సపోర్ట్‌ చేస్తుంది, అలాగే బార్సిలోనా కాటలాన్‌ జాతీయవాదాన్ని సపోర్ట్‌ చేస్తుంది.

బార్సిలోనా అనేది స్పెయిన్‌లో భాగమే అయినా.. వారికంటూ ప్రత్యేక భాష, సంస్కృతి, అలాగే పాలనా పరంగా స్వయంప్రతిపత్తి ఉంది. అందుకే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ అంటే అది కేవలం మ్యాచ్‌ మాత్రమే కాదు ఒక మినీ యుద్ధం. ఎలాగైతే మనం ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను చూస్తామో.. ఫుట్‌బాల్‌ అభిమానులు ఈ రియల్‌ మాడ్రిడ్‌ వర్సెస్‌ బార్సిలోనా మ్యాచ్‌ను చూస్తారు. అయితే ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ రెండు మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌. అలాగే రెండు టీమ్స్‌కు కూడా ఫ్యాన్‌ బేస్‌ సమానంగా ఉంటుంది. పైగా ఈ రెండు జట్లు తలపడితే చూసేందుకు ఎక్కవ క్రికెట్‌ అభిమానులు ఆసక్తి చూపిస్తారు. అందుకే క్రికెట్‌ అభిమానులు.. ఫుట్‌బాల్‌ అభిమానులు వాడే ఎల్‌ క్లాసికో అనే పదాన్ని ఈ ఇక్కడ వాడుతున్నారు. అంటే ఐపీఎల్‌లో సీఎస్‌కే వర్సెస్‌ ఎంఐ మ్యాచ్‌ అంటే ఇదో క్లాసిక్‌ ఫైట్ అని అర్థం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..