IND vs ENG 5th Test Preview: నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య ఐదో టెస్ట్.. చారిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో టీమిండియా..!

|

Sep 10, 2021 | 12:01 PM

India vs England 5th Test Prediction: చారిత్రాత్మక విజయానికి టీమిండియా కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఈ మ్యాచులో గెలిచి 3-1 తేడాతో ట్రోఫీని సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.

IND vs ENG 5th Test Preview: నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య ఐదో టెస్ట్.. చారిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో టీమిండియా..!
India Vs England
Follow us on

India vs England Previous Stats, Preview: ఐదు టెస్టుల సిరీస్‌ చివరి దశకు చేరింది. ఈ సిరీస్‌లో కోహ్లీసేన ఇప్పటికే 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టులోనూ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆరాటపడుతోంది. మరోవైపు, ఈ మ్యాచులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న కసితో ఇంగ్లండ్‌ టీం కోరుకుంటోంది. చివరి టెస్టులో ఎవరు గెలుస్తారో చూడాలి. అయితే, ఐదో టెస్టుకు ముందు టీమిండియాలో కరోనా కలకలం రేగింది. ఆటగాళ్లకు అత్యంత సన్నిహితంగా ఉన్న జూనియర్‌ ఫిజియో యోగేశ్‌ పర్మార్‌కు కోవిడ్ పాజిటివ్‌ రావడంతో అంతా అయోమయంలో పడ్డారు. బుధవారం సాయంత్రం వరకు ఆటగాళ్లతోనే కలిసి పని చేయడంతో కేసులు మరిన్ని పేరిగే అవకాశం ఉందని సమాచారం. ఫిజియోకి కరోనా సోకడంతో ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకున్న భారత ఆటగాళ్లు హోటల్‌ గదులకే పరిమితమయ్యారు. అయితే, టీమిండియాలోని ఆటగాళ్లందరికీ కోవిడ్ పరీక్షలు చేయగా, నెగిటివ్ రావడంతో చివరి టెస్టుకు ఆటంకాలు తొలిగినట్లైంది. షెడ్యూల్ ప్రకారమే ఐదో టెస్ట్ జరగనుంది.

ఎప్పుడు: ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా, 5 వ టెస్ట్, సెప్టెంబర్ 10 నుంచి 14 వరకు, సాయంత్రం 3.30 గంటలకు

ఎక్కడ: ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్

వాతావరణం: నేటి నుంచి ప్రారంభం కానున్న మాంచెస్టర్ టెస్టుకు వరుణుడు అడ్డు పడే అవకాశం ఉంది. తొలి రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ నివేదికలు వెల్లడించాయి. ఒక వేళ వర్షం కురిసి మ్యాచ్‌ రద్దయితే.. సిరీస్‌ టీమిండియా చేజిక్కించుకుంటుంది. దీంతో ఆస్ట్రేలియా (2018-19), ఇంగ్లండ్‌(2021)ల్లో టెస్టు సిరీస్‌ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు. 2015 నుంచి ఇక్కడ సగటు మొదటి ఇన్నింగ్స్ మొత్తం 435 గా నమోదైంది. అలాగే సగటు రెండవ ఇన్నింగ్స్ మొత్తం 238 అత్యల్పంగా ఉంది. దీంతో టాస్ గెలిచిన టీంలు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

ఇంగ్లండ్
జో రూట్ అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచులో గెలిచేందుకు టీంలో భారీ మార్పులు చేశారు. బెయిర్‌ స్టో స్థానంలో జట్టులోకి వచ్చిన జోస్‌ బట్లర్‌కి వైస్‌ కెప్టెన్‌ ‌గా వ్యవహరించే అవకాశం ఉంది. గత మ్యాచుకు దూరంగా ఉన్న మార్క్‌ వుడ్‌తో, క్రిస్ వోక్స్‌ బౌలింగ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి మార్క్ వుడ్‌ను టీంలో చేర్చారు. క్రెయిగ్ ఓవర్టన్ స్థానంలో మార్క్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ తమ చివరి తొమ్మిది టెస్టుల్లో ఆరు ఓడింది. వారు కేవలం కొంతమంది అగ్రశ్రేణి ప్లేయర్లు అందుబాటులో లేకపోవడంతో టీం చతికిలపడుతోంది. జేమ్స్ ఆండర్సన్, ఒల్లీ రాబిన్సన్ ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో వరుసగా 163.3, 166.4 ఓవర్లు బౌలింగ్ చేశారు. అయితే, ఈ మ్యాచులో జేమ్స్ అండర్సన్‌, క్రేగ్‌ ఓవర్టన్‌లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి.

ప్లేయింగ్ XI: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, జో రూట్ (సి), ఒల్లీ పోప్, జోస్ బట్లర్ (కీపర్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్

భారత్
కోవిడ్ పరిస్థితులతో మాంచెస్టర్ టెస్టులో టీమిండియా ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగనుంది. ఈ మ్యాచులో అజింక్యా రహానెను పక్కన పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, పుజారాలకు గాయాలు తగ్గకపోతే హనుమ విహారి, సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచులో ఆడే అవకాశం ఉంది. సిరాజ్, బుమ్రా ఇద్దరూ వరుసగా నాలుగు టెస్టుల్లో పాల్గొనడంతో బౌలింగ్ విభాగంలో కూడా మార్పు జరిగేలా ఉంది. సుదీర్ఘ పర్యటనతో వరుసగా ఆడుతోన్న సిరాజ్‌కు విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో మహ్మద్ షమీ తిరిగి జట్టులో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్పిన్ విభాగంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మోకాలి గాయంతో బాధపడుతోన్న జడేజాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జడేజా స్థానంలో అశ్విన్‌ చివరి టెస్టులో బరిలోకి దిగనున్నాడు.

ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, రిషబ్ పంత్ (కీపర్), శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

మీకు తెలుసా?

– చరిత్రలో రెండుసార్లు మాత్రమే టీమిండియా విదేశీ సిరీస్‌లో మూడు టెస్టులు గెలిచింది. 1967/68 లో న్యూజిలాండ్‌లో 3-1 తేడాతో గెలిచిన భారత్.. 2017 లో శ్రీలంకలో 3-0 గెలిచి సిరస్ గెలుచుకుంది.

– ఆండర్సన్ తన స్వదేశంలో జరిగిన తొమ్మిది టెస్టుల్లో ఇంతవరకు ఐదు వికెట్లు తీయలేదు.

– బుమ్రా ఇప్పటి వరకు 151 ఓవర్లు బౌల్ చేశాడు. 2018 లో అతని టెస్ట్ అరంగేట్రం నుంచి ఒక సీజన్‌లో బుమ్రాకు ఇదే అత్యధికంగా ఉంది. 2014 ఇంగ్లండ్ పర్యటనలో భువనేశ్వర్ కుమార్ వికెట్ల సంఖ్యను అధిగమించడానికి బుమ్రా మరో రెండు వికెట్లు పడగొడితే చాలు.

జట్లు..
టీమిండియా : విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా, మయాంక్ అగర్వాల్‌, అజింక్య రహానె, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఇశాంత్‌ శర్మ, మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్, వృద్ధిమాన్‌ సాహా, అభిమన్యు ఈశ్వరన్‌, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌, శార్థూల్ ఠాకూర్‌.

ఇంగ్లండ్‌ : రోరీ బర్న్స్‌, హసీబ్‌ హమీద్‌, మొయిన్‌ అలీ, జానీ బెయిర్‌ స్టో, జో రూట్‌, జోస్‌ బట్లర్‌, డాన్‌ లారెన్స్‌, ఓలీ రాబిన్సన్‌, సామ్‌ కరన్‌, ఓలీ రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌, జేమ్స్‌ అండర్సన్‌, జాక్‌ లీచ్‌, ఓలీ పోప్‌, డేవిడ్‌ మలన్‌, క్రేగ్‌ ఓవర్టన్‌.

Also Read: T20 World Cup: భారత్‌, ఆస్ట్రేలియాల నుంచి ఇంగ్లండ్‌ వరకు.. స్టార్ ప్లేయర్లతో పొట్టి ప్రపంచ కప్‌ బరిలో నిలిచిన దేశాలు.. టీంల పూర్తి వివరాలు..!

Hardik Pandya: నేను ఆల్ రౌండర్‌గా మారడానికి ఆయనే కారణం..! ఆసక్తికర విషయాలు పంచుకున్న హార్దిక్ పాండ్యా