ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి.. ఏం చూసి ఇతన్ని ఎంపిక చేశారంటే?

వాషింగ్టన్ సుందర్ గాయంతో శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు భారత జట్టులోకి వచ్చిన సారాంశ్ జైన్ ఎవరు? మధ్యప్రదేశ్ తరఫున అద్భుత ప్రదర్శనతో పాటు 181 వికెట్లు, 2,223 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్‌కు ఇదే తొలి భారత టెస్ట్ పిలుపు. ఐపీఎల్‌లో అవకాశం రాకపోయినా ఇప్పుడు టీమిండియాలో చోటు దక్కింది.

ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి.. ఏం చూసి ఇతన్ని ఎంపిక చేశారంటే?
Saransh Jain

Updated on: Jul 28, 2026 | 12:20 PM

శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్న మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. గాయంతో తొలి టెస్టుకు అందుబాటులో లేని వాషింగ్టన్ సుందర్ స్థానంలో బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. దీంతో దశాబ్దానికి పైగా దేశీయ క్రికెట్‌లో కష్టపడి రాణించిన సారాంశ్‌కు తొలి అంతర్జాతీయ పిలుపు లభించింది. ఇండోర్‌కు చెందిన 33 ఏళ్ల సారాంశ్ జైన్ కుడిచేతి ఆఫ్‌స్పిన్ బౌలర్. అవసరమైన సమయంలో విలువైన పరుగులు చేసే ఎడమచేతి బ్యాటర్ కూడా. 2014లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతడు, తన స్థిరమైన ప్రదర్శనతో జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 181 వికెట్లు పడగొట్టడంతో పాటు 2,223 పరుగులు చేసి తన సామర్థ్యాన్ని నిరూపించాడు.

ఇది కూడా చదవండి: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

సారాంశ్‌కు క్రికెట్ కుటుంబ వారసత్వంగా వచ్చింది. అతని తండ్రి సుభోధ్ జైన్ కూడా మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీ ఆడిన ఆఫ్‌స్పిన్ బౌలర్. అయితే ఆయనకు భారత జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు అదే కలను సారాంశ్ నెరవేర్చబోతున్నాడు. మధ్యప్రదేశ్ తొలి రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన 2022 సీజన్‌లో సారాంశ్ కీలక పాత్ర పోషించాడు. ముంబైతో జరిగిన ఫైనల్‌లో బ్యాట్‌తో అర్ధశతకం సాధించడంతో పాటు బంతితోనూ కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత కూడా దేశీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

ఇటీవల శ్రీలంక ‘ఏ’ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్‌లో ఇండియా ‘ఏ’ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టడంతో పాటు అజేయంగా 70 పరుగులు చేసి ఉపఖండ పిచ్‌లపై తన ఆల్‌రౌండ్ ప్రతిభను చాటుకున్నాడు. ఈ ప్రదర్శనే అతడికి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కేలా చేసింది. ఆసక్తికర విషయం ఏమిటంటే, దేశీయ క్రికెట్‌లో అద్భుత రికార్డులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా సారాంశ్ జైన్‌ను కొనుగోలు చేయలేదు. 2024, 2025, 2026 ఐపీఎల్ వేలాల్లో పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఒక్క బిడ్ కూడా దక్కలేదు. అయితే ఇప్పుడు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కడంతో అతని కెరీర్ కొత్త మలుపు తిరిగింది. శ్రీలంక పర్యటనలో అవకాశం లభిస్తే తన ప్రతిభను అంతర్జాతీయ వేదికపై నిరూపించుకోవాలని సారాంశ్ జైన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us