Cricket News: మహ్మద్ అజహరుద్దీన్ ఇండియాకి ఒక గొప్ప కెప్టెన్. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు. హైదరాబాద్‌కు చెందిన ఈ ఆటగాడిని మణికట్టు మాంత్రికుడిగా పిలుస్తారు. అజహర్ తన అరంగేట్రం మ్యాచ్ నుంచి చూపిన సత్తా అతని కెరీర్‌లో చాలా వరకు కొనసాగింది. తర్వాత తన బ్యాటింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. కోల్‌కతాలో ఇంగ్లండ్‌తో జరిగిన తన అరంగేట్రం టెస్టులో అజహర్ సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు. ఇందులో అతను వరుసగా 6215, 9378 పరుగులు చేశాడు. అతను మూడు ప్రపంచ కప్‌లలో భారతదేశానికి నాయకత్వం వహించాడు అలా చేసిన ఏకైక భారత కెప్టెన్ కూడా. అయితే అజహర్ కెరీర్ ప్రారంభం అంత ఈజీగా కాలేదు. అతను ఒకసారి మూడు బంతులు ఆడిన తర్వాత సెలక్టర్లు అతడిని తిరస్కరించారు. ఇది అజార్‌కు చాలా నిరాశ కలిగించింది అయితే తర్వాత అతను భారతదేశం కోసం ఆడాడు.
బెంగళూరులో జరిగిన ట్రయల్స్‌లో ఒక సంఘటన
ఇది 1979 నాటిది. ఆ సమయంలో అజర్ అండర్-19 ట్రయల్స్ ఇవ్వడానికి బెంగళూరుకు వెళ్లాడు. అయితే అజర్ మూడు బంతులు ఆడిన తర్వాత సెలక్టర్లు అతడిని బయటకు వెళ్లమన్నారు. జీ టీవీ పాత షో ‘జీనా ఇసి కా నామ్ హై’లో అజహర్ ఈ ఉదంతం గురించి చెప్పాడు. “నేను 79లో అండర్-19 ఎంపిక కోసం బెంగళూరు వెళ్ళినప్పుడు. రెండు మూడు బంతులు ఆడిన తర్వాత నన్ను బయటకు వెళ్లిపోమన్నారు. నువ్వు సెలెక్ట్ కాలేదని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవచ్చని చెప్పారు. నేను హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వచ్చాను. ఎక్కువ బంతులు ఆడటానికి అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశ చెందాను. మూడు బంతుల్లో ఏమి తెలుస్తుంది. సాధారణంగా నేను నిరుత్సాహపడను కానీ ఆ సమయంలో అలా జరిగిందని” చెప్పాడు. కానీ తర్వాత అజహర్ ఇండియాకి కెప్టెన్ అయ్యాడు. ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు.