IPL 2021: హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోవడం చాలా కాలంగా చర్చనీయాంశంగా మారింది. అతను చాలా కాలంగా బౌలింగ్ చేయడం కనిపించలేదు. ఐపీఎల్ 2021 లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న హార్దిక్.. ఇంత వరకు బౌలింగ్ చేయలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో వచ్చే నెలలో మొదలయ్యే టీ 20 ప్రపంచకప్‌లో పాండ్యా టీమిండియాలో ఎలాంటి పాత్ర పోషిస్తాడోనని అంతా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయమై ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే మాట్లాడుతూ అసలు విషయం చెప్పాడు. పాండ్యకు బౌలింగ్ చేయడంలో అంత ఆసక్తి చూపించడం లేదని, బౌలింగ్‌తో హార్ధిక్‌కు పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, అలాగే ఇది రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో ప్రదర్శనను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన కాన్ఫరెన్స్‌లో శుక్రవారం మహేలా మాట్లాడుతూ, పాండ్యా బౌలింగ్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎందుకంటే అది అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందని అన్నాడు. “హార్దిక్ ఎక్కువ కాలంగా బౌలింగ్ చేయడం లేదు. కాబట్టి మేం హార్దిక్ కోసం మా వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. పాండ్యాను బౌలింగ్ చేయాలని మేం పట్టుబడితే, అతని బ్యాటింగ్‌పై అది ప్రభావం చూపించే అవకాశం ఉంది. అప్పుడు ఇటు బౌలింగ్‌లోనూ, అటు బ్యాటింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడకపోవచ్చని” పేర్కొన్నాడు.
శ్రీలంక పర్యటనలో బౌలింగ్..
శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియాలో హార్దిక్ ఉన్నాడు. ఈ పర్యటనలో హార్దిక్ బౌలింగ్ కూడా చేశాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో బౌలింగ్ చేశాడు. ఈ మూడు మ్యాచ్‌లలో రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీశాడు. అనంతరం అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరిగే టీ 20 ప్రపంచ కప్‌నకు ఎంపికయ్యాడు. జట్టును ప్రకటించిన చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ, పాండ్యా బౌలింగ్ చేయడానికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని తెలిపాడు. అయితే, ఐపీఎల్ 2021 రెండవ దశ మొదటి మ్యాచ్‌లో ప్లేయింగ్-11 లో లేడు. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. కానీ, హార్ధిక్ బౌలింగ్ చేయలేదు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా అజేయంగా 40 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
Also Read: Watch Video: వికెట్ల కోసం తంటా.. స్లిప్స్‌లో ఎనిమిది మంది.. ఫీల్డింగ్ చూస్తే ఆశ్చర్యపోతారంటే!