Virat Kohli : కింగ్ కోహ్లీ డూప్లికేట్ చూశారా..ఎంత ముద్దుగా ఉన్నాడో ?

Virat Kohli : వడోదర లో ప్రాక్టీస్ సమయంలో విరాట్ కోహ్లీ తన చిన్ననాటి డూప్లికేట్ గర్విత్ ఉత్తమ్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. చోటా చీకూగా పేరు పెట్టి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Virat Kohli : కింగ్ కోహ్లీ డూప్లికేట్ చూశారా..ఎంత ముద్దుగా ఉన్నాడో ?
Virat

Updated on: Jan 13, 2026 | 9:13 AM

Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో పరుగుల వర్షం కురిపించే కింగ్ కోహ్లీ, బయట కూడా తన వ్యక్తిత్వంతో అభిమానుల మనసు గెలుచుకుంటూనే ఉంటాడు. తాజాగా వడోదరలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే మ్యాచ్‌కు ముందు ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అచ్చం కోహ్లీ చిన్నప్పటిలాగే ఉన్న ఒక బుజ్జి అభిమానిని చూసి విరాట్ మురిసిపోయాడు. వడోదర వన్డేకు ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో ఒక చిన్నారి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ చిన్నారి పేరు గర్విత్ ఉత్తమ్. గర్విత్ రూపం అచ్చం విరాట్ కోహ్లీ చిన్నప్పటి ఫోటోలను పోలి ఉండటమే ఈ వైరల్ వార్తకు కారణం. ప్రాక్టీస్ ముగించుకుని వస్తున్న కోహ్లీని చూసి గర్విత్ విరాట్.. విరాట్ అని పిలవగానే, కోహ్లీ ఆ చిన్నారిని చూసి ఆగిపోయాడు. గర్విత్ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన కోహ్లీ, వెంటనే తన కెప్టెన్ రోహిత్ శర్మను పిలిచి “అక్కడ చూడు.. అచ్చం నా డూప్లికేట్ కూర్చున్నాడు” అని సరదాగా వ్యాఖ్యానించాడు.

కోహ్లీ ఆ చిన్నారిని కేవలం పలకరించడమే కాకుండా తన దగ్గరికి పిలిచి మరీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ సమయంలో గర్విత్ ను ప్రేమగా చోటా చీకూ అని నామకరణం చేశాడు. విరాట్ కోహ్లీకి ముద్దు పేరు చీకూ అన్న సంగతి తెలిసిందే. “ఇప్పటి నుంచి నేను నీకు ఫ్రెండ్‌ని” అని కోహ్లీ చెప్పడంతో ఆ బుజ్జి అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన చిన్ననాటి ప్రతిరూపాన్ని చూసుకున్నట్లుగా కోహ్లీ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. ఈ ముచ్చటైన దృశ్యాలను చూసిన అభిమానులు “చిన్న కోహ్లీ దొరికేశాడు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అసలు ఈ జూనియర్ కోహ్లీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? గర్విత్ ఉత్తమ్ హర్యానాలోని పంచకుల నివాసి. ఒక ప్రముఖ కంపెనీ తన వాణిజ్య ప్రకటన కోసం కోహ్లీ చిన్నప్పటిలా ఉండే అబ్బాయిని వెతకగా, దేశవ్యాప్తంగా నిర్వహించిన వేటలో గర్విత్ దొరికాడు. ఆ యాడ్ షూటింగ్ కోసం విరాట్‌ను కలిసేందుకు గర్విత్ తన కుటుంబంతో కలిసి వడోదరకు వచ్చాడు. కోహ్లీ చిన్నప్పటి కటింగ్, అదే కళ్లద్దాలు, అవే హావభావాలతో గర్విత్ అచ్చం కింగ్ కోహ్లీలాగే కనిపిస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..