
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్ల మధ్య జరిగిన పోరు తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆట కంటే కూడా జేసన్ హోల్డర్ పట్టిన ఒక వివాదాస్పద క్యాచ్, దానిపై విరాట్ కోహ్లీ అంపైర్లతో జరిపిన వాగ్వాదం ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశంగా మారింది.
ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్షద్ ఖాన్ వేసిన షార్ట్ డెలివరీని రజత్ పాటిదార్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న జేసన్ హోల్డర్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే బంతిని పట్టే క్రమంలో అది నేలకు తాకినట్లు రీప్లేలో కనిపించడంతో వివాదం మొదలైంది. థర్డ్ అంపైర్ దీనిని ‘అవుట్’గా ప్రకటించడంతో ఆర్‌సీబీ క్యాంప్ విస్మయానికి గురైంది.
Ball clearly touched the ground, it’s a clear notout. Virat Kohli wasn’t happy with Umpire decision.He schooled Umpire live in front of 130k fans😭🔥pic.twitter.com/2QrEN2nDCh
— ` (@wokenupkohli) April 30, 2026
పాటిదార్ అవుట్ కావడంతో అప్పటికే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. వెంటనే బౌండరీ లైన్ వద్దకు వచ్చి ఫోర్త్ అంపైర్‌తో సుదీర్ఘంగా చర్చించాడు. హోల్డర్ క్యాచ్ పట్టేటప్పుడు బంతి నేలకు తగిలిందని, ఆ నిర్ణయం సరైంది కాదని కోహ్లీ వాదించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
బీసీసీఐ ప్రవర్తనా నియమావళి (ఆర్టికల్ 2.8) ప్రకారం, అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం లేదా వాదించడం తీవ్రమైన నేరం. గతంలో నితీష్ రాణా ఇదే సీజన్‌లో అంపైర్‌తో వాదించినందుకు తన మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాను ఎదుర్కొన్నాడు. కోహ్లీపై కూడా ఇలాంటి జరిమానా పడే అవకాశం ఉంది. ఒకవేళ అంపైర్లు దీనిని ‘లెవల్ 2’ నేరంగా పరిగణిస్తే, కోహ్లీకి ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం కూడా లేకపోలేదు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు కోహ్లీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో 5 ఫోర్లు కొట్టి జోరు పెంచాడు. అయితే పవర్‌ప్లేలోనే కోహ్లీ అవుట్ కావడం, ఆ తర్వాత పాటిదార్ వివాదాస్పద రీతిలో వెనుదిరగడంతో ఆర్‌సీబీ కష్టాల్లో పడింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్‌సీబీకి కోహ్లీపై రాబోయే క్రమశిక్షణ చర్యలు పెద్ద దెబ్బగానే భావించవచ్చు.