IND vs AFG : ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు రోహిత్, విరాట్ అవుట్.. వన్డే జట్టులోకి ఆ యంగ్ ప్లేయర్లకు లైన్ క్లియర్

IND vs AFG : విరాట్ కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడటం లేదు. ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడిన తర్వాత విరాట్ ప్రస్తుతం యూరప్ పర్యటనకు వెళ్ళినట్లు తెలుస్తోంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటంపై కూడా ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది.

IND vs AFG : ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు రోహిత్, విరాట్ అవుట్.. వన్డే జట్టులోకి ఆ యంగ్ ప్లేయర్లకు లైన్ క్లియర్
Virat Kohli

Updated on: Jun 04, 2026 | 6:00 PM

IND vs AFG : భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జూన్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత జూన్ 14 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతుండటంతో, అభిమానులు అతడిని టీమిండియా జెర్సీలో చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు ఒక పెద్ద షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు దూరం కాబోతున్నట్లు సమాచారం.

గాయం కారణంగా దూరమైన కింగ్ కోహ్లీ

మీడియా నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడటం లేదు. ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడిన తర్వాత విరాట్ ప్రస్తుతం యూరప్ పర్యటనకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతంగా ఆడి నాటౌట్‌గా 75 పరుగులు చేశాడు. కానీ ఆ మ్యాచ్ సమయంలో అతను కాలికి పట్టీ కట్టుకుని బ్యాటింగ్ చేయడం అందరూ గమనించారు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో కోహ్లీ మంచి ఫామ్‌లో ఉండి 56 సగటుతో 675 పరుగులు చేశాడు. అయితే విరాట్ దూరం కావడంపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అతను చివరిగా జనవరి 2026లో న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ ఆడాడు.

రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పైనా అనుమానాలు

కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే కాదు,  మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటంపై కూడా ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. రోహిత్ కూడా హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నాడు. ఈ సమస్య వల్లే అతను ఐపీఎల్ 2026 లో కూడా కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి తప్పుకోవడం దాదాపు ఖాయం కాగా, రోహిత్‌కు ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించలేదు. సీనియర్లు అందుబాటులో లేకపోతే యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు వన్డే జట్టులో ఓపెనర్లుగా మంచి అవకాశాలు లభిస్తాయి.

జూన్ 6న సెలక్టర్ల కీలక సమావేశం

భారత జట్టు భవిష్యత్తు సిరీస్‌లపై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. జూన్ 6వ తేదీన సెలక్టర్లు ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో పాటు, రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సంబంధించిన భారత జట్లను ఎంపిక చేయనున్నారు. రోహిత్, విరాట్‎ల ఫిట్‌నెస్ నివేదికలను పరిశీలించిన తర్వాతే సెలక్టర్లు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us