Ranji Trophy: డ్రాగా ముగిసిన రంజీ ట్రోఫీ 2024-25 ఫైనల్‌ మ్యాచ్‌! కానీ, ఆ జట్టును ఛాంపియన్‌గా ప్రకటించారు!

రంజీ ట్రోఫీ 2024-25 ఫైనల్ మ్యాచ్ కేరళ మరియు విదర్భ జట్ల మధ్య డ్రాగా ముగిసింది. కానీ, రంజీ ట్రోఫీ నియమాల ప్రకారం, తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన విదర్భ జట్టు ఛాంపియన్‌గా ప్రకటించారు. విదర్భ 379 పరుగులు చేయగా, కేరళ 342 పరుగులు చేసింది. విదర్భ కెప్టెన్ అక్షయ్ వాడేకర్ ట్రోఫీని అందుకున్నారు. కేరళ కెప్టెన్ సచిన్ బెబీ 98 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు.

Ranji Trophy: డ్రాగా ముగిసిన రంజీ ట్రోఫీ 2024-25 ఫైనల్‌ మ్యాచ్‌! కానీ, ఆ జట్టును ఛాంపియన్‌గా ప్రకటించారు!
Vidharbha Ranji Team

Updated on: Mar 02, 2025 | 3:42 PM

రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో భాగంగా కేరళ-విదర్భ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డ్రాగా ముగిసింది. ఫిబ్రవరి 26న నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో ఈ ఫైనల్‌ మ్యాచ్‌ ఆరంభం అయింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్‌ ఈ రోజు(మార్చ్‌ 2, ఆదివారం) డ్రాగా ముగిసింది. అయినప్పటికీ విదర్భ రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. అదేంటి ఫైనల్‌ మ్యాచ్‌ డ్రా అయితే ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించాలి కదా అనుకుంటున్నారా.. రంజీలో అలా ప్రకటించరు. ఇక్కడ ఒక రూల్‌ ఉంది. ఒక టీమ్‌ రెండు ఇన్నింగ్స్‌లు ఆడి, మరో టీమ్‌ ఒక్క ఇన్నింగ్స్‌ మాత్రమే ఆడితే.. రెండు జట్ల తొలి ఇన్నింగ్స్‌ల్లో ఎక్కవ రన్స్‌ చేసిన టీమ్‌ను విజేతగా ప్రకటిస్తారు. ఆ లెక్కన ఈ సారి రంజీ ట్రోఫీ విజేతగా విదర్భ జట్టు నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు దిగిన విదర్భ 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. ఐదో రోజు వరకు మూడు ఇన్నింగ్స్‌లు మాత్రమే జరగడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో కేరళ కంటే ఎక్కువ రన్స్‌ చేసిన విదర్భను ఛాంపియన్‌గా ప్రకటించారు. దీంతో విదర్భ కెప్టెన్‌ అక్షయ్‌ వాడేకర్‌ ట్రోఫీని అందుకున్నాడు. గత 7 ఏళ్లలో విదర్భ మూడో సారి రంజీ ఛాంపియన్‌గా నిలవడం విశేషం. ఇక కేరళ కెప్టెన్‌ సచిన్‌ బెబీ రన్నరప్‌ ట్రోఫీని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎంతో అద్భుతంగా ఆడిన సచిన్‌ బెబీ 98 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అవుట్‌ అయ్యాడు. సెంచరీకి కేవలం 2 పరుగుల దూరంలో అవుట్‌ అయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.