
Vaibhav Suryavanshi : ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది.. అతడే బిహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ బుజ్జీ గాడు మైదానంలోకి దిగితే రికార్డులు తిరగరాయాల్సిందే. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున మరోసారి బరిలోకి దిగుతున్న ఈ యువ కిరణం, నేడు (మార్చి 27, శుక్రవారం) తన 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. కేవలం 14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన వైభవ్, ఈ చిన్న వయసులోనే సాధించిన ఆ 15 అద్భుత రికార్డులపై ఓ లుక్కేద్దాం..
వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ఆ 15 అద్భుత రికార్డులు ఇవే
1. ఐపీఎల్ వేలంలో అత్యంత పిన్న వయస్కుడు:
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఆక్షన్ చరిత్రలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. నవంబర్ 2024లో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతనిని రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడు అతని వయసు కేవలం 13 ఏళ్ల 8 నెలలు మాత్రమే.
2. ఐపీఎల్ ఆడిన అతి చిన్న వయస్కుడు:
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు వైభవ్ వయసు 14 ఏళ్ల 23 రోజులు. లీగ్ చరిత్రలో మ్యాచ్ ఆడిన యంగెస్ట్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
3. తొలి బంతికే సిక్సర్ – సరికొత్త రికార్డు:
ఐపీఎల్ కెరీర్‌లో తను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాదిన ఘనత వైభవ్ సొంతం. ఇంత తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్ అతడే.
4. ఐపీఎల్ లో అత్యంత పిన్న వయసులో సెంచరీ:
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో వైభవ్ సెంచరీ బాదాడు. తద్వారా ఐపీఎల్ లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.
5. భారతీయుడి వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ:
కేవలం 35 బంతుల్లోనే వైభవ్ వంద పరుగులు పూర్తి చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒక భారతీయుడు సాధించిన వేగవంతమైన సెంచరీ. ఓవరాల్‌గా క్రిస్ గేల్ (30 బంతులు) తర్వాత ఇదే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ.
6. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (భారతీయుడు):
ఒకే ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో వైభవ్ 11 సిక్సర్లు బాదాడు. దీనితో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మురళీ విజయ్ రికార్డును వైభవ్ సమం చేశాడు.
7. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ – ఫాస్టెస్ట్ సెంచరీ:
2026 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి యువ వన్డేల్లో భారీ స్కోరు మరియు వేగవంతమైన సెంచరీ రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
8. యూత్ వన్డేలో అత్యధిక సిక్సర్లు:
అదే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ ఏకంగా 15 సిక్సర్లు బాదాడు. ఇది యూత్ వన్డే చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక సిక్సర్ల రికార్డు.
9. లిస్ట్-ఏ క్రికెట్‌లో యంగెస్ట్ సెంచూరియన్:
విజయ్ హజారే ట్రోఫీలో 14 ఏళ్ల 272 రోజుల వయసులో కేవలం 36 బంతుల్లో సెంచరీ చేసి, లిస్ట్-ఏ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు.
10. ఏబీ డివిలియర్స్ రికార్డు బ్రేక్:
అరుణాచల్ ప్రదేశ్‌పై జరిగిన లిస్ట్-ఏ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 59 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా డివిలియర్స్ (64 బంతులు) పేరిట ఉన్న ఫాస్టెస్ట్ 150 రన్స్ రికార్డును తుడిచిపెట్టాడు.
11. ఇంగ్లాండ్ గడ్డపై విధ్వంసం:
2025లో ఇంగ్లాండ్ పర్యటనలో యూత్ వన్డే మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే సెంచరీ బాది, విదేశీ గడ్డపై తన సత్తా చాటాడు.
12. యూత్ టెస్టుల్లో కూడా వేగవంతమైన సెంచరీ:
కేవలం వన్డేలు, టీ20లే కాదు.. ఆస్ట్రేలియా అండర్-19 తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 58 బంతుల్లోనే సెంచరీ బాది టెస్ట్ ఫార్మాట్‌లోనూ తన వేగాన్ని నిరూపించుకున్నాడు.
13. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రెండో యంగెస్ట్ ప్లేయర్:
కేవలం 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. భారత్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన రెండో అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
14. రిషబ్ పంత్ రికార్డు మటాష్:
2026లో సౌత్ ఆఫ్రికాపై జరిగిన అండర్-19 మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. తద్వారా పంత్ (18 బంతులు) పేరిట ఉన్న ఫాస్టెస్ట్ యూత్ వన్డే ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేశాడు.
15. లిస్ట్-ఏ అరంగేట్రంలో రికార్డు:
కేవలం 13 ఏళ్ల 269 రోజుల వయసులో విజయ్ హజారే ట్రోఫీలో అడుగుపెట్టి, భారత్ తరపున లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..