
Vaibhav Suryavanshi Touches MS Dhoni’s Feet: భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ పట్ల యువ క్రికెటర్లు చూపించే గౌరవం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం, మే 20న చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అనంతరం, రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ధోనీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ధోనీ వద్దకు రాగానే, వైభవ్ సూర్యవంశీ ఒక్కసారిగా కిందకు వంగి, భారత మాజీ కెప్టెన్ పాదాలకు నమస్కరించాడు. ఊహించని ఈ పరిణామానికి ధోనీ కూడా చిరునవ్వుతో వైభవ్‌ను పట్టుకుని పైకి లేపి, అతనితో కొద్దిసేపు ముచ్చటించినట్లు కనిపించింది. ఈ అపురూప దృశ్యం భారతీయ సంస్కృతిలో పెద్దల పట్ల చూపించే గౌరవానికి ప్రతీకగా నిలిచిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించడంలో వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. కేవలం 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే పలు సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న వైభవ్.. ఈ మ్యాచ్‌లోనూ తన ప్రతిభను చాటాడు. అంతకుముందు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే సెంచరీ (101 పరుగులు) చేసి, ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం, అలాగే టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో బీహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యువ కెరటం, తన ఆటతీరుతో పాటు వినయ విధేయతలతో అందరి మన్ననలు పొందుతున్నాడు. ధోనీ వంటి దిగ్గజ ఆటగాడి పట్ల వైభవ్ చూపిన గౌరవం, యువతరం క్రికెటర్లపై ధోనీ ప్రభావం ఎంతగా ఉందో తెలియజేస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనతో వైభవ్ క్రీడా నైపుణ్యంతో పాటు, అతని సంస్కారం కూడా అభిమానులను ఆకట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా వైభవ్ ప్రతిభను, ఆటపై అతనికున్న అవగాహనను కొనియాడాడు.
Vaibhav touching Mahi’s feet ♥️
Sanskar 💯💯#CSKvsRR #VaibhavSuryavanshi pic.twitter.com/61tMzFjWSm
— URS AKASH (@AapkaAkash05) May 20, 2025
గతంలో కూడా యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు ధోనీ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న సందర్భాలున్నాయి. ఇది భారత క్రికెట్‌లో గురు-శిష్య పరంపరకు, పెద్దల పట్ల గౌరవభావానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..