Vaibhav Suryavanshi : సౌతాఫ్రికాలో వైభవ్ సూర్యవంశీకి చుక్కెదురు..అరంగేట్రం రోజే కెప్టెన్‌గా ఫెయిల్

Vaibhav Suryavanshi : శనివారం (జనవరి 3) నుంచి భారత్, సౌతాఫ్రికా అండర్-19 జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. రెగ్యులర్ కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా గాయపడటంతో కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీకి టీమిండియా పగ్గాలు అప్పగించారు.

Vaibhav Suryavanshi : సౌతాఫ్రికాలో వైభవ్ సూర్యవంశీకి చుక్కెదురు..అరంగేట్రం రోజే కెప్టెన్‌గా ఫెయిల్
Vaibhav Suryavanshi

Updated on: Jan 03, 2026 | 3:27 PM

Vaibhav Suryavanshi : భారత క్రికెట్ ప్రపంచంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న సెన్సేషనల్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సౌతాఫ్రికా గడ్డపై మొదటిసారి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ పరుగుల వర్షం కురిపించిన ఈ 14 ఏళ్ల సూర్యవంశీకి, సౌతాఫ్రికాలో మాత్రం ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. అండర్-19 వరల్డ్ కప్ 2026కు ముందు జరుగుతున్న ఈ కీలక సిరీస్‌లో భారత్ ఓటమి అంచుల్లో నిలవడమే కాకుండా, కెప్టెన్‌గా వైభవ్ కూడా నిరాశపరిచాడు. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.

శనివారం (జనవరి 3) నుంచి భారత్, సౌతాఫ్రికా అండర్-19 జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. రెగ్యులర్ కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా గాయపడటంతో కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీకి టీమిండియా పగ్గాలు అప్పగించారు. తద్వారా క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. అయితే ఈ అరుదైన మైలురాయిని తన బ్యాటింగ్‌తో చిరస్మరణీయం చేసుకోలేకపోయాడు. దూకుడుగా ఆడే క్రమంలో కేవలం 12 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి ఏడో ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు.

సౌతాఫ్రికాలోని బెనోనీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వైభవ్ ఒక్కడే కాదు, టీమిండియా బ్యాటింగ్ లైనప్ అంతా కుప్పకూలింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ రెండో ఓవర్‌లోనే డకౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన వైభవ్ కూడా ఆదుకోలేకపోయాడు. ఒక దశలో వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు, వేదాంత్ త్రివేది 33 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నట్లు కనిపించినా.. కుందు రనౌట్ కావడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ మరుసటి ఓవర్‌లోనే వేదాంత్ కూడా అవుట్ అవ్వడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

అండర్-19 వరల్డ్ కప్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో భారత జట్టు ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది.సౌతాఫ్రికా పిచ్‌లపై మన కుర్రాళ్ళు బౌన్స్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ వంటి స్టార్ ప్లేయర్ తొలి మ్యాచ్‌లోనే తక్కువ పరుగులకే అవుట్ కావడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశమే. అయితే సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో, వైభవ్ మళ్ళీ పుంజుకుని కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతాడని కోచ్‌లు, అభిమానులు ఆశిస్తున్నారు.

గతంలో ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడై వార్తల్లో నిలిచిన వైభవ్ సూర్యవంశీని జూనియర్ గిల్ అని పిలుచుకుంటారు. దేశవాళీ క్రికెట్‌లో సెంచరీల మీద సెంచరీలు బాదిన ఈ కుర్రాడికి ఇది నిజమైన అగ్నిపరీక్ష. విదేశీ గడ్డపై తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి వైభవ్‌కు ఇది ఒక గొప్ప అవకాశం. తర్వాతి మ్యాచ్‌లలోనైనా ఈ యువ కెప్టెన్ తన ఫామ్‌ను అందిపుచ్చుకుంటాడో లేదో వేచి చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి