Vaibhav Suryavanshi : 15 ఏళ్ల వయసు.. 15 ఇన్నింగ్స్‌లు.. 50 సిక్సర్లు.. క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే 50 సిక్సర్లు పూర్తి చేసి సరికొత్త సిక్సర్ కింగ్‌గా అవతరించాడు.శనివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే, క్రికెట్ ప్రపంచానికి కొత్త సిక్సర్ కింగ్ దొరికాడనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Vaibhav Suryavanshi : 15 ఏళ్ల వయసు.. 15 ఇన్నింగ్స్‌లు.. 50 సిక్సర్లు.. క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi Chris Gayles

Updated on: Apr 26, 2026 | 1:46 PM

Vaibhav Suryavanshi : ఐపీఎల్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. నిన్నటి వరకు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక అసాధ్యమైన రికార్డును, కేవలం 15 ఏళ్ల భారత కుర్రాడు వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ యువ సంచలనం, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే, క్రికెట్ ప్రపంచానికి కొత్త సిక్సర్ కింగ్ దొరికాడనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు బాదిన రికార్డు ఇప్పటివరకు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ తన 21వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకోగా, వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే 50 సిక్సర్ల మార్కును దాటి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శనివారం హైదరాబాద్‌పై ఆడిన 103 పరుగుల ఇన్నింగ్స్‌లో అతను 12 సిక్సర్లు బాదడం విశేషం. దీంతో ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్‌గా కూడా వైభవ్ రికార్డు సృష్టించాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ బ్యాట్ నిప్పులు చెరుగుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 44.62 సగటుతో, 234.87 భారీ స్ట్రైక్ రేట్‌తో 357 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అభిషేక్ శర్మ (380 పరుగులు) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. గతేడాది ఐపీఎల్‌లో 24 సిక్సర్లు కొట్టిన వైభవ్, ఈ సీజన్‌లో కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 32 సిక్సర్లు బాదేయడం అతని ఫామ్‌కు నిదర్శనం. మొత్తంగా అతని ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 56 సిక్సర్లు నమోదయ్యాయి.

కేవలం 15 ఏళ్ల వయసులో వైభవ్ చూపిస్తున్న పవర్ హిట్టింగ్ చూసి మాజీ క్రికెటర్లు నోరెళ్లబెడుతున్నారు. నిన్నటి మ్యాచ్‌లో అతను చేసిన 103 పరుగులు అతని ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీ. గత సీజన్‌లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్, ఈసారి 36 బంతుల్లో ఆ మార్కును అందుకున్నాడు. అంటే తన మొదటి సెంచరీ కంటే ఇది ఒక బంతి ఆలస్యంగా వచ్చింది. అందుకే దీనిని సరదాగా అతని కెరీర్‌లో అత్యంత నెమ్మదైన సెంచరీ అని పిలుస్తున్నారు.

వైభవ్ అద్భుతమైన సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ 228 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 74 పరుగులతో వీరవిహారం చేయడంతో హైదరాబాద్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. వైభవ్ శ్రమ వృథా అయినప్పటికీ, అతని రికార్డు సృష్టి మాత్రం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో అతను ఐపీఎల్ ఆల్ టైమ్ సిక్సర్ కింగ్ అవ్వడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us