Vaibhav Sooryavanshi : అంచనాలన్నీ అట్టర్ ప్లాప్.. బుడ్డోడికి ఇక బై బై చెప్పేసినట్లేనా ?

Vaibhav Sooryavanshi : ఇంగ్లండ్‌తో వరుసగా రెండు టీ20ల్లో విఫలమైన వైభవ్ సూర్యవంశీపై విమర్శలు పెరుగుతున్నాయి. సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వస్తాడా అనే చర్చ మొదలైంది. అయితే వైభవ్‌ కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.

Vaibhav Sooryavanshi  : అంచనాలన్నీ అట్టర్ ప్లాప్.. బుడ్డోడికి ఇక బై బై చెప్పేసినట్లేనా ?
Vaibhav Sooryavanshi

Updated on: Jul 08, 2026 | 3:18 PM

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ సీనియర్ జట్టులోకి దూసుకొచ్చిన వైభవ్ సూర్యవంశీ ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టులో వైభవ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అతను బ్యాట్‌తో నిరాశపరిచాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిన వైభవ్, నాటింగ్‌హామ్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ కేవలం 5 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఈ చిన్న ఇన్నింగ్స్‌లోనే రెండు అద్భుతమైన సిక్సర్లు బాది తనలోని హిట్టింగ్ టాలెంట్‌ను చూపించాడు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానంలో వైభవ్‌ను జట్టులోకి తీసుకోవడంతో, అతని వరుస వైఫల్యాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇంత చిన్న వయసులోనే అతడిని అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకురావడం తొందరపాటేనా అని కొందరు మాజీలు ప్రశ్నిస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఫెయిల్ అయినప్పటికీ, అతడిని ప్రస్తుతానికి ప్లేయింగ్ ఎలెవన్ నుంచి దూరం చేసే అవకాశం లేదని తెలుస్తోంది. టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ యంగ్ సంచలనానికి మరికొన్ని అవకాశాలు ఇచ్చి పూర్తిగా పరీక్షించాలని భావిస్తోంది. వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ శైలి గురించి అందరికీ తెలిసిందే కాబట్టి, క్రీజులో ఉన్న కొద్దిసేపైనా అతను ప్రత్యర్థి బౌలర్లలో వణుకు పుట్టించగలడనే నమ్మకం జట్టు వర్గాల్లో ఉంది. దీనివల్ల సంజూ శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు. అయితే, వరుసగా ఫ్లాప్ అవుతున్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్‌ను ఫిట్ చేసే విషయమై మేనేజ్‌మెంట్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. అతను సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్ అక్కడ 2-0 తో ఘోరంగా సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాన్ని ప్రత్యర్థికి ఇచ్చేసింది. ఆ ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్‌కు అవకాశం రాలేదు. ఇప్పుడు ఇంగ్లండ్‌లోనూ అదే ఓటముల పరంపర కొనసాగుతుండటంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలపై విమర్శలు వస్తున్నాయి. గత మ్యాచ్‌లో సీనియర్ ఆల్ రౌండర్ శివం దూబే కంటే ముందుగా బౌలర్ హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపడం పట్ల పలువురు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ లైనప్ ఇంగ్లండ్ బౌలర్ల దాటికి పేకమేడలా కూలిపోయింది. కేవలం 11.4 ఓవర్లలోనే టీమిండియా 76 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో ఇంగ్లండ్ జట్టు 125 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్లలో ఎవరూ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోవడంతో ఈ ఘోర పరాభవం ఎదురైంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us