Vaibhav Suryavanshi : టెన్త్ పరీక్షలకు వైభవ్ సూర్యవంశీ డుమ్మా..ఎగ్జామ్ హాల్‌ దగ్గర పోలీసుల పహారా అంతా వేస్టేనా ?

Vaibhav Suryavanshi : టీమిండియా అండర్-19 ప్రపంచకప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించి, రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ బుడతడు ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది.

Vaibhav Suryavanshi : టెన్త్ పరీక్షలకు వైభవ్ సూర్యవంశీ డుమ్మా..ఎగ్జామ్ హాల్‌ దగ్గర పోలీసుల పహారా అంతా వేస్టేనా ?
Vaibhav Suryavanshi

Updated on: Feb 16, 2026 | 3:58 PM

Vaibhav Suryavanshi : టీమిండియా అండర్-19 ప్రపంచకప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించి, రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ బుడతడు ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం వైభవ్ ఈ ఏడాది బోర్డు పరీక్షలకు హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని వైభవ్ తండ్రి స్వయంగా ధృవీకరించారు. తాజ్‌పూర్‌లోని మోడెస్టీ స్కూల్ ప్రిన్సిపాల్ ఆదర్శ్ కుమార్ (పింటూ) మాట్లాడుతూ.. వైభవ్ తండ్రితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వైభవ్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) నిర్వహిస్తున్న సిరీస్‌లు, శిక్షణలో చాలా బిజీగా ఉన్నాడని, అందుకే పరీక్షలకు సమయం కేటాయించలేకపోతున్నాడని వివరించారు. నిజానికి వైభవ్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, కానీ దేశం కోసం ఆడటమే ప్రాధాన్యతగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన అడ్మిట్ కార్డ్ కూడా ఇప్పటికే జారీ అయ్యింది. సమస్తిపూర్‌లోని పొద్దార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో అతడికి పరీక్షా కేంద్రం కేటాయించారు. స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిషోర్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, వైభవ్ అడ్మిట్ కార్డ్, ఇతర ముఖ్యమైన పత్రాలు స్కూల్ వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పరీక్షల కోసం వైభవ్ వచ్చుంటే, అతడిని ఒక సాధారణ విద్యార్థిలాగే పరిగణించేవాళ్లమని, ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించే ప్రసక్తే లేదని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 17 నుంచి 10వ తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వైభవ్ సూర్యవంశీకి ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, అతడు పరీక్ష రాయడానికి వస్తే భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందని పాఠశాల యాజమాన్యం ముందుగానే ఊహించింది. దీనివల్ల పరీక్షా కేంద్రం వద్ద గందరగోళం కలగకుండా స్థానిక పోలీసులకు సమాచారం అందించి భద్రతను కూడా కోరింది. అయితే, ఇప్పుడు వైభవ్ పరీక్షలకు రావడం లేదని స్పష్టమవడంతో అటు స్కూల్ సిబ్బందికి, ఇటు పోలీసులకు కాస్త ఊరట లభించింది.

చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న వైభవ్, ఐపీఎల్ వేలంలో కూడా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి ఫోకస్ మొత్తం క్రికెట్ కెరీర్‌పైనే ఉంది. బోర్డు పరీక్షలు మళ్లీ రాసుకోవచ్చని, కానీ ఈ కీలక సమయంలో క్రికెట్ ప్రాక్టీస్‌ను వదులుకోకూడదని వైభవ్ కుటుంబం భావిస్తోంది. ఏదేమైనా ఒక స్టార్ క్రికెటర్ పరీక్షలకు దూరమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us