IPL Records : మొదలవ్వకముందే ఐపీఎల్ 2026 హీట్.. ఆ 5 భారీ రికార్డులపైనే అందరి కళ్లు

IPL Records : ప్రపంచంలోనే అత్యంత ధనిక, పాపులర్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ (IPL) అంటేనే రికార్డుల గని. ఇక్కడ సిక్సర్ల వర్షం కురుస్తుంది, వికెట్లు గాల్లో తేలుతాయి. మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సందడి మొదలుకానున్న నేపథ్యంలో, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ పాత రికార్డులను మరోసారి నెమరువేసుకుంటున్నారు.

IPL Records : మొదలవ్వకముందే ఐపీఎల్ 2026 హీట్.. ఆ 5 భారీ రికార్డులపైనే అందరి కళ్లు
Virat Kohli

Updated on: Mar 13, 2026 | 5:16 PM

IPL Records : ప్రపంచంలోనే అత్యంత ధనిక, పాపులర్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ (IPL) అంటేనే రికార్డుల గని. ఇక్కడ సిక్సర్ల వర్షం కురుస్తుంది, వికెట్లు గాల్లో తేలుతాయి. మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సందడి మొదలుకానున్న నేపథ్యంలో, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ పాత రికార్డులను మరోసారి నెమరువేసుకుంటున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజాలు వచ్చారు, వెళ్లారు కానీ కొన్ని రికార్డులు మాత్రం చెక్కుచెదరకుండా అలానే ఉండిపోయాయి. ఆధునిక క్రికెట్‌లో బ్యాటర్లు ఎంత వేగంగా ఆడుతున్నా, బౌలర్లు ఎన్ని మ్యాజిక్కులు చేసినా బద్దలు కొట్టడానికి సాధ్యం కాని ఆ 5 అద్భుతమైన రికార్డుల గురించి తెలుసుకుందాం.

1. క్రిస్ గేల్ 175 పరుగుల అరాచకం

2013 ఏప్రిల్ 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్రిస్ గేల్ సృష్టించిన సునామీ ఇది. పూణే వారియర్స్‌పై ఆర్‌సీబీ తరపున ఆడుతూ గేల్ కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 13 ఫోర్లు, ఏకంగా 17 సిక్సర్లు ఉన్నాయి. టి20 క్రికెట్ చరిత్రలోనే ఒక వ్యక్తిగత ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. ఈ రికార్డును బద్దలు కొట్టడం ప్రస్తుత తరం బ్యాటర్లకు కూడా ఒక అసాధ్యమైన సవాల్‌గా కనిపిస్తోంది.

2. 30 బంతుల్లోనే సెంచరీ.. గేల్ ఫాస్టెస్ట్ రికార్డ్

అదే 175 పరుగుల ఇన్నింగ్స్‌లో గేల్ మరో అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఐపీఎల్ మాత్రమే కాదు, ప్రొఫెషనల్ క్రికెట్ చరిత్రలోనే నమోదైన అత్యంత వేగవంతమైన శతకం ఇదే. పవర్‌ప్లేలో బ్యాటర్లు ఎంతగా విరుచుకుపడుతున్నా, ఈ 30 బంతుల రికార్డును చేరుకోవడం అనేది అసాధారణమైన విషయం.

3. విరాట్ కోహ్లీ 973 పరుగులు

ఐపీఎల్ 2016 సీజన్ విరాట్ కోహ్లీకి ఒక స్వర్ణ యుగం లాంటిది. ఆ ఒక్క సీజన్‌లోనే కోహ్లీ 16 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 973 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. ఇందులో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒకే సీజన్‌లో 900 పైచిలుకు పరుగులు చేయడం ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. గిల్, బట్లర్ వంటి వారు ప్రయత్నించినప్పటికీ కోహ్లీ నెలకొల్పిన ఈ పరుగుల శిఖరాన్ని ఎవరూ అధిగమించలేకపోయారు.

4. కోహ్లీ – డివిలియర్స్ 229 పరుగుల భారీ భాగస్వామ్యం

2016లో గుజరాత్ లయన్స్‌పై విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ కలిసి బ్యాటింగ్‌లో మ్యాజిక్ చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు బాదడం, అది కూడా ఇంత భారీ స్కోరు సాధించడం ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మరియు అజేయమైన రికార్డుగా నిలిచిపోయింది. చిన్నస్వామి స్టేడియంలో సాగిన ఈ విధ్వంసం ఫ్యాన్స్‌కు ఇప్పటికీ కళ్ల ముందే ఉంటుంది.

5. అల్జారీ జోసెఫ్ అరంగేట్రం మ్యాజిక్ (6/12)

బౌలింగ్ విభాగంలో ఈ రికార్డు చాలా ప్రత్యేకమైనది. 2019లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసిన వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇంతటి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయడం ఒక ప్రపంచ రికార్డు. అంతకుముందు 2008లో సోహైల్ తన్వీర్ (6/14) పేరిట ఉన్న రికార్డును జోసెఫ్ తిరగరాశాడు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us