
R Ashwin: తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2025 సీజన్‌లో వివాదాస్పద ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై అంపైర్‌తో తీవ్రంగా వాగ్వాదానికి దిగిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు భారీ జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. అంపైర్ల నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేసినందుకు 10 శాతం, పరికరాలను (బ్యాట్, గ్లోవ్స్) దుర్వినియోగం చేసినందుకు 20 శాతం చొప్పున ఈ జరిమానా విధించినట్లు TNPL అధికారులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో దిండిగల్ డ్రాగన్స్ తరపున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్, ఐడ్రీమ్ తిరుప్పుర్ తమిళన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో సాయి కిషోర్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి బంతిని మిస్ అయ్యాడు. బంతి అతని ప్యాడ్స్‌కు తగలడంతో తిరుప్పుర్ ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. ఆన్-ఫీల్డ్ అంపైర్ క్రితికా అశ్విన్‌ను ఔట్‌గా ప్రకటించారు.
అయితే, ఈ నిర్ణయంపై అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి లెగ్ స్టంప్ బయట పిచ్ అయిందని, అది ఔట్ కాదని అంపైర్‌తో వాదించాడు. కానీ, దిండిగల్ డ్రాగన్స్‌కు అప్పటికే రెండు DRS (డిసిషన్ రివ్యూ సిస్టమ్) అవకాశాలు (వైడ్ బాల్స్ కోసం) అయిపోవడంతో, అశ్విన్ తన నిర్ణయాన్ని సవాలు చేయలేకపోయాడు.
Ash அண்ணா Not Happy அண்ணாச்சி! 😶🌫
📺 தொடர்ந்து காணுங்கள் | TNPL 2025 | iDream Tiruppur Tamizhans vs Dindigul Dragons | Star Sports தமிழில் #TNPLOnJioStar #TNPL #TNPL2025 pic.twitter.com/Csc2ldnRS3
— Star Sports Tamil (@StarSportsTamil) June 8, 2025
అంపైర్ తన వాదనను పట్టించుకోకపోవడంతో అశ్విన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. బ్యాట్‌ను తన ప్యాడ్స్‌కు గట్టిగా కొట్టుకుంటూ, అనంతరం గ్లోవ్స్‌ను విసిరేస్తూ పెవిలియన్ వైపు వెళ్ళాడు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు అశ్విన్ నిర్ణయాన్ని సమర్ధించగా, మరికొందరు అతని ప్రవర్తనను తప్పుబట్టారు. ఒక సీనియర్ ఆటగాడిగా ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శించారు.
మ్యాచ్ అనంతరం జరిగిన విచారణలో అశ్విన్ తనపై విధించిన జరిమానాను అంగీకరించినట్లు TNPL అధికారులు తెలిపారు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 11 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు చేశాడు. అతని వికెట్ పడిన తర్వాత దిండిగల్ డ్రాగన్స్ బ్యాటింగ్ కూలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిండిగల్ 93 పరుగులకే ఆలౌట్ కాగా, తిరుప్పుర్ తమిళన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..