
Simon Harmer : కోల్‌కతా టెస్ట్‌లో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.చిన్న టార్గెట్ కూడా ఛేజ్ చేయలేకపోవడంతో దేశం మొత్తం షాక్‌లో ఉంది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి.. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్. అతను రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 8 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కూల్చేశాడు. అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడిన హార్మర్, ఇక్కడితో ఉన్న తన పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అతని అంతర్జాతీయ కెరీర్ తిరిగి పుంజుకోవడంలో ముంబైలోని సచిన్ టెండూల్కర్ జిమ్‌ఖానా ముఖ్య పాత్ర పోషించింది.
స్పిన్నర్లకు అనుకూలించిన కోల్‌కతా పిచ్‌పై సైమన్ హార్మర్ అద్భుతంగా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారత బ్యాటర్లు అతని ముందు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మొదటి ఇన్నింగ్స్ లో 15.2 ఓవర్లలో కేవలం 30 పరుగులు ఇచ్చి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ వికెట్లను తీశాడు.రెండో ఇన్నింగ్స్ లో 14 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా మరియు కుల్దీప్ యాదవ్ వంటి ముఖ్యమైన ఆటగాళ్లను అవుట్ చేసి భారత్ ఓటమికి పునాది వేశాడు.
2015లో అంతర్జాతీయ జట్టు నుంచి తొలగింపునకు గురైన తర్వాత సైమన్ హార్మర్ కెరీర్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో అతను ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. సౌతాఫ్రికా నుంచి నేరుగా భారత్‌కు వచ్చి, ముంబైలోని ఎంసీఏ సచిన్ టెండూల్కర్ జిమ్‌ఖానాలో దాదాపు 10 రోజులు గడిపాడు. అక్కడ ఉమేష్ పట్వాల్ అనే కోచ్‌తో కలిసి హార్మర్ తన బౌలింగ్‌పై తీవ్రంగా శ్రమించాడు. ఉమేష్‌ను హార్మర్ తన గురువుగా భావిస్తారు. అంతర్జాతీయ కెరీర్ ఆగిపోయిన తర్వాత బౌలింగ్ పట్టు, రన్-అప్‌తో సహా బౌలింగ్ చేసే విధానాన్ని ఉమేష్ పట్వాల్ పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా బంతిని పట్టుకునేటప్పుడు బొటనవేలు ఉపయోగించని హార్మర్‌కు, దానిని ఉపయోగించడం ఎలాగో నేర్పించారు. ఈ మార్పులన్నీ హార్మర్‌కు బాగా ఉపయోగపడ్డాయి.
ఉమేష్ పట్వాల్ వద్ద శిక్షణ తీసుకుని తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకున్న తర్వాత, సైమన్ హార్మర్ 2017లో ఇంగ్లాండ్‌లో కోల్‌పాక్ డీల్ చేసుకున్నాడు. కోల్‌పాక్ డీల్ అంటే, ఆటగాడు తమ అంతర్జాతీయ కెరీర్‌కు కొంతకాలం దూరంగా ఉండి, విదేశీ ఆటగాడిగా కాకుండా దేశీయ ఆటగాడిగా కాంటీ క్రికెట్‌లో ఆడే అవకాశం. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత, హార్మర్ 2022లో సౌతాఫ్రికా జాతీయ జట్టులోకి తిరిగి అడుగుపెట్టాడు. హార్మర్ ఇప్పటివరకు సౌతాఫ్రికా తరఫున 13 టెస్ట్ మ్యాచ్‌లలో 23.38 సగటుతో 60 వికెట్లు తీశాడు. ఇక భారత్‌పై అయితే కేవలం 3 టెస్టుల్లోనే 18 వికెట్లు పడగొట్టి, భారత్‌పై అత్యధిక వికెట్లు తీసిన సౌతాఫ్రికా స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..