AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీసీసీఐ వద్దంది.. ఐపీఎల్ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. సంచలన నిర్ణయంతో షాకిచ్చిన టీమిండియా బ్యాడ్ లక్ ప్లేయర్

Prithvi Shaw to leave Mumbai: పృథ్వీ షా ఈ సంచలన నిర్ణయం అతని కెరీర్‌కు ఎలాంటి మలుపునిస్తుందో వేచి చూడాలి. కొత్త వాతావరణం, కొత్త జట్టులో పృథ్వీ షా తన పూర్తి సామర్థ్యాన్ని చాటి, తిరిగి భారత జట్టులోకి అడుగుపెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

బీసీసీఐ వద్దంది.. ఐపీఎల్ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. సంచలన నిర్ణయంతో షాకిచ్చిన టీమిండియా బ్యాడ్ లక్ ప్లేయర్
Prithvi Shaw Batting
Venkata Chari
|

Updated on: Jun 23, 2025 | 7:01 PM

Share

Prithvi Shaw to leave Mumbai: భారత దేశవాళీ క్రికెట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన యువ ఓపెనర్ పృథ్వీ షా, ముంబై క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. తన హోమ్ టీమ్ ముంబైని వదిలి, మరొక రాష్ట్ర జట్టు తరపున ఆడటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోసం అభ్యర్థన పంపాడు. MCA ఈ అభ్యర్థనను ఆమోదించినట్లు సోమవారం ధృవీకరించింది. దీంతో పృథ్వీ షా కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయం మొదలవనుంది.

ముంబైతో ముగిసిన అనుబంధం..

పృథ్వీ షా 2017లో ముంబై తరపున అరంగేట్రం చేశాడు. అండర్-19 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన కెప్టెన్‌గా, ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి టెస్టుల్లో సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. అయితే, గత కొన్నేళ్లుగా అతని కెరీర్ ఒడిదుడుకులతో సాగుతోంది. ఫిట్‌నెస్ సమస్యలు, క్రమశిక్షణారాహిత్యం వంటి ఆరోపణలు అతని కెరీర్‌ను దెబ్బతీశాయి. గత ఏడాది రంజీ ట్రోఫీ జట్టు నుంచి ఫిట్‌నెస్ కారణాలతో షాను తొలగించారు. ఆ తర్వాత కొన్ని టోర్నమెంట్లలో ఆడినప్పటికీ, నిలకడైన ప్రదర్శన చేయలేకపోయాడు.

కొత్త అవకాశాల కోసం..

తాజాగా MCAకి పంపిన లేఖలో పృథ్వీ షా, “నా కెరీర్ ఈ దశలో, మరొక రాష్ట్ర అసోసియేషన్ కింద ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటానికి నాకు ఒక మంచి అవకాశం లభించింది. ఇది ఒక క్రికెటర్‌గా నా ఎదుగుదలకు, అభివృద్ధికి మరింత దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ మేరకు, రాబోయే దేశవాళీ సీజన్‌లో కొత్త రాష్ట్ర అసోసియేషన్‌ను అధికారికంగా ప్రాతినిధ్యం వహించడానికి నాకు NOC జారీ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను” అని పేర్కొన్నాడు.

ముంబై క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అభయ్ హడప్ మాట్లాడుతూ, “పృథ్వీ షా అసాధారణమైన ప్రతిభావంతుడు. ముంబై క్రికెట్‌కు గణనీయమైన సహకారం అందించాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. అతని భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం” అని అన్నారు.

తదుపరి గమ్యం ఏది?

పృథ్వీ షా ఏ రాష్ట్ర జట్టులో చేరతాడో ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే, అతను మహారాష్ట్ర జట్టుకు మారే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. గతంలో కూడా ముంబైకి చెందిన కొందరు ఆటగాళ్లు, ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, ముంబైని విడిచిపెట్టి గోవా తరపున ఆడటానికి మారిన విషయం తెలిసిందే.

పృథ్వీ షా ఈ సంచలన నిర్ణయం అతని కెరీర్‌కు ఎలాంటి మలుపునిస్తుందో వేచి చూడాలి. కొత్త వాతావరణం, కొత్త జట్టులో పృథ్వీ షా తన పూర్తి సామర్థ్యాన్ని చాటి, తిరిగి భారత జట్టులోకి అడుగుపెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..