
Bengaluru Stampede: బెంగళూరు స్టేడియం తొక్కిసలాట కేసులో RCB యాజమాన్యానికి కర్నాటక హైకోర్టులో స్వల్పం ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరిని అరెస్ట్ చేయరాదని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తొక్కిసలాటతో తమకు సంబంధం లేదని, తప్పుడు కేసులు పెట్టారని, వాటిని కొట్టేయాలని RCB యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
విక్టరీ పరేడ్‌కు కోట్లాదిమంది తరలిరావాలన్న ట్వీట్‌తోనే జనం స్టేడియం దగ్గరకు లక్షలాదిమంది తరలివచ్చారని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి వాదించారు. 30 వేల మంది కేపాసిటీ ఉన్న స్టేడియానికి 5 లక్షల మంది తరలివచ్చారని, అందుకే పరిస్థితి అదుపు తప్పిందన్నారు. అయితే RCB యాజమాన్యం ట్వీట్ తొక్కిసలాటకు కారణమని ఆరోపించడం తగదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
కేసు విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. అప్పటికి ఇంకా అరెస్ట్ చేయని నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. వేడుకలకు రావాలని తాము ఎవరికి ఆహ్వనం పలకలేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు RCB తరపు న్యాయవాది సీవీ నాగేశ్. సీఎం సిద్దరామయ్యనే జనం భారీగా తరలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఈ ఘటనకు బాధ్యత వహించాలని RCB యాజమాన్యం తరపున ఆయన వాదనలు విన్పించారు.
బెంగళూరులో RCB విక్టరీ పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. 54 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. సీఎం సిద్దరామయ్య , డిప్యూటీ సీఎం శివకుమార్ రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..