WTC Final: న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియా ఇంకెన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

|

Oct 20, 2024 | 8:25 PM

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా అనూహ్యంగా పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్ లో 450 కు పైగా పరుగులు చేసినప్పటికీ, మొదటి ఇన్నింగ్స్ లో మరీ 46 రన్స్ కే కుప్పకూలడం భారత్ పాలిట శాపంగా మారింది. ఈ పరాజయంతో డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

WTC Final: న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియా ఇంకెన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
Team India
Follow us on

ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ జూన్‌లో జరగనుంది. ఈ ఫైనల్ లో ఆడాలంటే పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో నిలవడం తప్పనిసరి. ప్రస్తుతం టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన తర్వాత భారత అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. నిజానికి ఈ సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలవాల్సి ఉంది. అయితే తొలి మ్యాచ్‌లోనే అనూహ్య పరాజయం ఎదురైంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత భారత్ విజయాల శాతం తగ్గింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ విజయ శాతం 74.24గా ఉంది. కానీ ఈ ఓటమి తర్వాత ఈ శాతం 68.06కు పడిపోయింది. ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడింది. 8 మ్యాచ్‌లు గెలిచి, మూడు మ్యాచ్‌లు ఓడి, ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భారత్ ఇంకా ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

 

ఇవి కూడా చదవండి

ఇందులో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఏడింటిలో ఎన్ని మ్యాచ్‌లు గెలుస్తారన్న దాన్ని బట్టే ఫైనల్స్‌లో స్థానం ఖరారవుతుంది. ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ ఇప్పుడు ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు గెలవాలి. కాబట్టి న్యూజిలాండ్‌తో రెండు, ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌లు గెలవాలి. భారత్‌ నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే గెలుపు శాతం 64.03గా ఉండడంతో ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ 7 మ్యాచ్‌ల్లో భారత్ 5 గెలిస్తే ఫైనల్‌కు చేరడం ఖాయమైనట్టే.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అప్డేటెడ్ పాయింట్ల పట్టిక..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ రెండుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. తొలి ఫైనల్ లో న్యూజిలాండ్‌తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో సీజన్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు భారత జట్టు మూడోసారి ఫైనల్ చేరుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..