Team India: టీమిండియాకు కేవలం 12 మ్యాచ్‌లే.. కోహ్లీ, రోహిత్‌ల భవితవ్యం తేలేది అప్పుడే.!

గడిచిన 10 ఏళ్లుగా టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షే. ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ రోహిత్ సేన ఓటమిపాలవ్వడంతో.. భారత అభిమానులకు నిరాశే మిగిలింది.

Team India: టీమిండియాకు కేవలం 12 మ్యాచ్‌లే.. కోహ్లీ, రోహిత్‌ల భవితవ్యం తేలేది అప్పుడే.!
Team India

Updated on: Jun 19, 2023 | 12:28 PM

గడిచిన 10 ఏళ్లుగా టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షే. ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ రోహిత్ సేన ఓటమిపాలవ్వడంతో.. భారత అభిమానులకు నిరాశే మిగిలింది. ఇదిలా ఉంటే.. భారతదేశంలో అక్టోబర్, నవంబర్ మధ్య ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. ఈ ట్రోఫీని ఎట్టి పరిస్థితుల్లోనూ టీమిండియా గెలిచి తీరాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇక అందుకోసం సన్నద్ధం అయ్యేందుకు కేవలం 12 మ్యాచ్‌లే ఉన్నాయి.

భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. మరోవైపు టీమిండియా చివరిసారిగా 2011లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోగా, ఇప్పుడు మరోసారి స్వదేశంలో అదే అవకాశం రావడంతో.. దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది టీమిండియా. ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. దీని తర్వాత రోహిత్ సేన ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీ వన్డే ఫార్మాట్‌లో జరుగుతుంది. ఇందులో భారత్ ఫైనల్ చేరితే.. ఇక్కడ ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

గ్రూప్‌ దశలో భారత్‌ రెండు మ్యాచ్‌లు ఆడాలి. ఆ తర్వాత భారత్‌ సూపర్‌-4లోకి వెళితే.. ఇక్కడ మూడు జట్లతో మూడు మ్యాచ్‌లు ఆడి ఫైనల్‌కు చేరితే ఒక మ్యాచ్‌ అంటే.. మొత్తం ఆరు మ్యాచ్‌లు.. దీని తర్వాత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాకు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ టూర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. దీని తర్వాత భారత్ వరల్డ్‌కప్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. దీంతో వెస్టిండీస్ టూర్ నుంచి ఆస్ట్రేలియా సిరీస్ వరకు మొత్తం 12 వన్డేలు ఆడుతుంది.

వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధం అయ్యేందుకు భారత్‌కు ఈ మ్యాచ్‌లు చాలు. బలమైన ఓపెనింగ్ జోడి లేక మిడిలార్డర్‌ను సిద్దం చేయడమే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ముందున్న సవాలు. శ్రేయాస్ అయ్యర్ కొంతకాలంగా మిడిల్ ఆర్డర్‌ను బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతడు ఇంకా కోలుకునే స్టేజిలో ఉన్నాడు. ఆసియా కప్ కల్లా శ్రేయాస్ ఫిట్‌గా ఉంటాడని బీసీసీఐ భావిస్తోంది.

అటు రిషబ్ పంత్‌కు ప్రత్యామ్నాయ బ్యాటర్, వికెట్ కీపర్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ ఇంకా వెతకాల్సి ఉంది. కెఎల్ రాహుల్ ఉన్నప్పటికీ.. అతడు ఫామ్ కోల్పోయాడు. ఈ 12 మ్యాచ్‌లలో సరైన టీమ్ కాంబినేషన్‌ను కనుగొనాలని రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ చూస్తున్నారు. అటు వరల్డ్ కప్‌లో ఒకవేళ భారత్ మరోసారి పేలవ ప్రదర్శన చేస్తే.. టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శకం ముగిసినట్లేనని సమాచారం.