
Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్ల నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇందులో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రెజర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈలిస్టులో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే చేరాడు. దీనిపై ట్వీట్ చేసిన అనిల్ కుంబ్లే.. మే 28న రెజ్లర్లకు జరిగిన ఘటన గురించి తెలిసి బాధపడ్డాడు. సరైన చర్చల ద్వారా ఏదైనా పరిష్కరించుకోవచ్చు. వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను అంటూ ప్రకటించాడు.
మే 28న కొత్త పార్లమెంట్ హౌస్ ఎదుట ఆందోళన చేస్తున్న రెజ్లర్లను పోలీసులు అమానుషంగా అరెస్ట్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. ఇప్పుడు ఇదే ఘటనను అనిల్ కుంబ్లే ప్రస్తావిస్తూ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. అనిల్ కుంబ్లేకు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రెజ్లర్ల పోరాటాన్ని ప్రస్తావించగా, వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందా? అంటూ ట్వీట్ చేశారు.
అలాగే, భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా నిరసన తెలిపిన రెజ్లర్లకు మద్దతు ఇచ్చాడు. సాక్షి, వినేష్ భారతదేశానికి గర్వకారణం. దేశం గర్వించదగ్గ వ్యక్తులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది. న్యాయం జరగాలని ప్రార్థిస్తానని భజ్జీ తన మద్దతు తెలిపాడు.
దీనిపై ట్వీట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్.. ‘‘దేశ జెండాను ఎగురవేసిన మన ఛాంపియన్లు ఈరోజు వీధుల్లోకి రావాల్సి రావడం బాధాకరం. ఇది సున్నితమైన సమస్య. అందువల్ల నిష్పక్షపాతంగా విచారణ జరగాలని, రెజ్లర్లకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ట్వీట్ చేస్తూ తన మద్దతును తెలిపాడు. భారత అథ్లెట్లు మనకు పతకాలు సాధించడమే కాదు, మనకెంతో గర్వకారణం అంటూ రెజ్లర్ల నిరసనకు మద్దతుగా ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.
మహిళా క్రికెటర్ శిఖా పాండే కుస్తీకి చాలా బలం కావాలి. కానీ నిజం మాట్లాడాలంటే అంతకంటే ఎక్కువ శక్తి కావాలి. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని, ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేస్తూ తన మద్దతును తెలిపింది.
అదేవిధంగా, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మైనర్లను లైంగికంగా వేధిస్తున్నారని, చాలా మంది మహిళా రెజ్లర్లను వేధించాడని ఆరోపిస్తున్నారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా.. ఇంతవరకు అరెస్టు చేసి ప్రశ్నించలేదు. కఠిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.
అయితే కఠిన చర్యలు తీసుకుంటామని సరైన హామీ రాకపోవడంతో తాము సాధించిన పతకాలను గంగా నదిలో వేస్తామని రెజ్లర్లు తెలిపారు. ఇండియా గేట్ వద్ద కూడా నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..