
IND vs SA 2nd Test: గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టమింయా వెనుకబడి ఉంది. మూడో రోజు భారత్ 201 పరుగులకే ఆలౌట్ అయింది. మూడో రోజు ఆట ముగిసే సమానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. మొత్తంగా 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోల్‌కతాలో అవమానకరమైన ఓటమి తర్వాత భారత్ బలమైన పునరాగమనం చేస్తుందని భావించారు. కానీ, గౌహతిలో పరిస్థితి మరింత దిగజారి, టీమ్ ఇండియాను సొంత గడ్డపై దారుణమైన మరకగా మిగిల్చింది.
ఒకప్పుడు భారత్‌ను స్వదేశంలో ఓడించడం కష్టమే కాదు, అసాధ్యం కూడా అని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, గత ఏడాది కాలంలో భారత జట్టు స్వదేశంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడిపోయింది. ఇంతలో, దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న గౌహతి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో, గత 59 ఏళ్లలో ఎప్పుడూ జరగనిది చోటు చేసుకుంది.
గౌహతి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా మంచి ఆరంభాన్ని ఇచ్చింది. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ 65 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. రాహుల్ 22 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత, జట్టు స్కోరు 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు, యశస్వి కూడా 58 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. అతని అవుట్‌తో, టీమిండియా ఇన్నింగ్స్ ముక్కల్లా కుప్పకూలింది.
రెండో వికెట్ 95 పరుగుల వద్ద పడిపోయింది. ఆ తర్వాత ఏడుగురు బ్యాట్స్‌మెన్ కేవలం 27 పరుగులకే ఔటయ్యారు. 59 ఏళ్లలో టీమ్ ఇండియా స్వదేశంలో ఇంత తక్కువ పరుగులకే ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1966లో కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌లో భారత్ 41 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
గౌహతి టెస్ట్ మూడో రోజు, టీం ఇండియా బ్యాట్స్‌మెన్ ఎదురుదెబ్బ తగులుతుందని భావించారు. కానీ అది జరగలేదు. భారత్ కేవలం 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కొంత పోరాటం ప్రదర్శించి 72 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. సుందర్ 48 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జట్టు 201 పరుగులకే ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (22), సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), రిషబ్ పంత్ (07) ఔటయ్యారు. దక్షిణాఫ్రికా తరఫున మార్కో జాన్సెన్ అద్భుతంగా రాణించి 6 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..