
Team India : 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అక్టోబర్ 4 నుంచి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 వేదికలను అధికారికంగా ప్రకటించింది. టోర్నీకి ఇంకా సవత్సరంపైనే సమయం ఉన్నప్పటికీ భారత జట్టు సిద్ధతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఎంపికపై చర్చలు సాగుతుండగా.. టీమిండియా పేస్ విభాగంలో సీనియర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితులపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు అశ్విన్ ఒక కీలక విజ్ఞప్తి చేశారు. టీమిండియా స్వింగ్ కింగ్‌గా పేరుగాంచిన భువనేశ్వర్ కుమార్‌ను మళ్లీ వన్డే జట్టులోకి తీసుకోవాలని సూచించారు. 2022లో భారత్ తరఫున చివరి వన్డే ఆడిన భువీని సౌతాఫ్రికా పిచ్‌లపై ఆడించడం జట్టుకు ఎంతో ప్రయోజనకరమని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్ గెలవడంలో భువనేశ్వర్ కుమార్ అత్యంత కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్ పొడవునా పదునైన స్వింగ్, యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టిన భువీ ఏకంగా 28 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేసులో చివరిదాకా నిలిచారు. ఈ అద్భుత ఫామ్‌ను దృష్టిలో ఉంచుకునే ఆయనను విజయ్ హజారే ట్రోఫీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిస్తూ 2027 వరల్డ్ కప్ నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అశ్విన్ యాజమాన్యానికి సలహా ఇచ్చారు.
ప్రస్తుతం భారత వన్డే జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ తప్ప సీనియర్ పేసర్లు లేకపోవడం అతిపెద్ద లోపంగా మారింది. హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై అస్పష్టత కొనసాగుతోంది. ఒకవేళ టోర్నీ సమయంలో బుమ్రాకు గాయాలైతే భారత పేస్ ఎటాక్ పూర్తిగా బలహీనపడుతుంది. కాబట్టి సౌతాఫ్రికాలోని స్వింగ్ అండ్ బౌన్స్ పిచ్‌లపై భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ లాంటి సీనియర్ల అనుభవం భారత్‌కు చాలా అవసరమని క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి