T20 World Cup 2026 : శ్రీలంకకు పరాభవం.. 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఎన్నడూ లేని చెత్త రికార్డు

T20 World Cup 2026 : న్యూజిలాండ్‌తో జరిగిన ఈ కీలక పోరులో లంక ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడమే కాకుండా, టీ20 ప్రపంచకప్ 19 ఏళ్ల చరిత్ర లోనే ఎన్నడూ లేని ఒక అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

T20 World Cup 2026 : శ్రీలంకకు పరాభవం.. 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఎన్నడూ లేని చెత్త రికార్డు
Sri Lanka

Updated on: Feb 26, 2026 | 7:49 AM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో భాగంగా బుధవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టుకు తీరని అవమానం ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ కీలక పోరులో లంక ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడమే కాకుండా, టీ20 ప్రపంచకప్ 19 ఏళ్ల చరిత్రలోనే ఎన్నడూ లేని ఒక అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. పరుగుల వేటలో తడబడిన శ్రీలంక ఆటగాళ్లు పవర్‌ప్లేలో చేతులెత్తేయడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

మొదట టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో చాలా నిలకడగా సాగింది. ఒకానొక దశలో 75 పరుగుల వద్ద కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన కివీస్, భారీ స్కోరు సాధించేలా కనిపించింది. అయితే శ్రీలంక బౌలర్లు పుంజుకోవడంతో సీన్ రివర్స్ అయింది. కేవలం 9 పరుగుల వ్యవధిలోనే 4 కీలక వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కనీసం 120 పరుగులు చేస్తుందా అని అనుకుంటున్న తరుణంలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్, కోల్ మెక్కాన్చీలు అద్భుతం చేశారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు ఏకంగా 47 బంతుల్లో 84 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, జట్టు స్కోరును 20 ఓవర్లలో 168/7కి చేర్చారు.

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే చుక్కలు కనిపించాయి. కివీస్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు క్రీజులో నిలవడానికి నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే శ్రీలంక తన అత్యల్ప పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. మొదటి 6 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఇంతకుముందెన్నడూ లంక ఇంత ఘోరంగా పవర్‌ప్లేలో ఆడలేదు. లక్ష్యం పెద్దదైనప్పుడు ధాటిగా ఆడాల్సింది పోయి, అతి జాగ్రత్తగా ఆడి వికెట్లు పారేసుకోవడం ఆ జట్టు కొంపముంచింది.

చివరికి శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 107/8 పరుగులకే పరిమితమై 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. జట్టులో కామిందు మెండిస్ (31 పరుగులు) మినహా ఎవరూ 30 పరుగుల మార్కును దాటలేకపోయారు. న్యూజిలాండ్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. ఈ ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ రేసు నుండి అధికారికంగా నిష్క్రమించగా, కివీస్ తన సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. తన చివరి మ్యాచ్‌లో కూడా గెలిస్తే న్యూజిలాండ్ నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us