
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టోర్నీలో పాల్గొనడంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వని పాక్, తాజాగా శనివారం జరగాల్సిన జట్టు జెర్సీ లాంచ్ ఈవెంట్‌ను హఠాత్తుగా రద్దు చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ టాస్ తర్వాత ఈ జెర్సీని ఆవిష్కరించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో పాక్ అసలు వరల్డ్ కప్ ఆడుతుందా? లేదా? అనే ఉత్కంఠ పరాకాష్టకు చేరుకుంది.
టీ20 వరల్డ్ కప్ 2026 నిర్వహణకు భారత్, శ్రీలంక సిద్ధమవుతుండగా, పాకిస్థాన్ మాత్రం ప్రతి అడుగులోనూ సస్పెన్స్ కొనసాగిస్తోంది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇప్పటికే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిసి ఈ విషయంపై చర్చించారు. బంగ్లాదేశ్‌ను ఐసీసీ టోర్నీ నుంచి తొలగించి, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చడాన్ని పాక్ తీవ్రంగా నిరసిస్తోంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరించాలని పాక్ ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ, ఐసీసీ నుంచి వచ్చే భారీ జరిమానాలు, ఆంక్షల భయంతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ అధికారికంగా జెర్సీని లాంచ్ చేయకపోవడం వెనుక ఏదో బలమైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ జట్టు ఫిబ్రవరి 2న (సోమవారం) కొలంబోకు ప్రయాణించేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేసుకుంది. అదే రోజు పాక్ ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఒకవేళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, జట్టు నేరుగా శ్రీలంకకు చేరుకుంటుంది. హైబ్రిడ్ మోడల్ ప్రకారం పాక్ తన గ్రూప్ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్-పాక్ మధ్య జరగాల్సిన మహా సమరంపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తే ఐసీసీ వాణిజ్యపరంగా దెబ్బతింటుందని, తద్వారా తమ నిరసనను ప్రపంచానికి తెలియజేయవచ్చని పీసీబీలోని ఒక వర్గం భావిస్తోంది.
మరోవైపు పాక్ వైఖరిని చూసి ఐస్లాండ్, ఉగాండా వంటి చిన్న దేశాల క్రికెట్ బోర్డులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నాయి. “మీరు రాకపోతే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, మా పాస్‌పోర్టులు రెడీ” అంటూ ఉగాండా క్రికెట్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఒకవేళ పాకిస్థాన్ చివరి నిమిషంలో తప్పుకుంటే, వారిపై శాశ్వత నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. దీనివల్ల పాక్ క్రికెట్ బోర్డుకు వచ్చే వార్షిక ఆదాయంలో సుమారు 34.5 మిలియన్ డాలర్ల గండి పడవచ్చు. మరి అన్ని కోల్పోయి పాక్ పంతం నెగ్గించుకుంటుందా? లేక సోమవారం నాటికి సర్దుకుంటుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..