
T20 World Cup 2026: భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు రంగం సిద్ధమైంది. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందే భారత జట్టులో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 15 మంది సభ్యుల జట్టును ప్రకటించినప్పటికీ, స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ గాయంతో దూరం కావడంతో ఒక సీనియర్ ప్లేయర్‌కు లైన్ క్లియర్ అయ్యింది. 4 సెంచరీలు బాదిన ధాకడ్ బ్యాటర్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగుతోంది.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా.. టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన సూర్యకుమార్ యాదవ్ (SKY) ఈ మెగా టోర్నీలో భారత జట్టును నడిపించనున్నాడు. ఇప్పటివరకు 99 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య, 163 స్ట్రైక్ రేట్‌తో 2788 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటికే 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు బాదిన రికార్డు అతని సొంతం. సూర్య కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత్ ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోకపోవడం గమనార్హం. అతని దూకుడు, వ్యూహాలే భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెడతాయని బీసీసీఐ నమ్ముతోంది.
శ్రేయస్ అయ్యర్ సర్ప్రైజ్ ఎంట్రీ.. ఈ జట్టులో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం శ్రేయస్ అయ్యర్ పునరాగమనం. 2023 డిసెంబర్ తర్వాత అయ్యర్ టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్ 2025లో, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించినప్పటికీ, మొదట ప్రకటించిన వరల్డ్ కప్ స్క్వాడ్‌లో సెలెక్టర్లు అతడిని విస్మరించారు. దీనిపై అభిమానుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అయితే, తాజా పరిస్థితుల దృష్ట్యా 31 ఏళ్ల ఈ అనుభవజ్ఞుడిని జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం.
యువ సంచలనం తిలక్ వర్మ జట్టులో కీలక ఆటగాడిగా ఎంపికయ్యాడు. కానీ, జనవరి 7న అతనికి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో రాజ్‌కోట్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షల అనంతరం అతనికి ‘టెస్టిక్యులర్ టోర్షన్’ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. అయితే, ఈ సర్జరీ నుంచి కోలుకోవడానికి కనీసం 4 వారాల సమయం పడుతుంది. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే వరల్డ్ కప్ నాటికి తిలక్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టమని తేలడంతో, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకురానున్నారు.
తిలక్ వర్మ దూరం కావడం బాధాకరమైన విషయమే అయినా, శ్రేయస్ అయ్యర్ వంటి అనుభవజ్ఞుడు జట్టులోకి రావడం మిడిల్ ఆర్డర్‌కు బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సూర్య నాయకత్వంలో టీమిండియా మరోసారి ప్రపంచ విజేతగా నిలుస్తుందో లేదో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..