T20 World Cup 2026: భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

2026లో జరిగే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను భారతదేశం వెలుపల ఆడాలనే డిమాండ్‌పై బంగ్లాదేశ్ మొండిగా ఉంది. ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపింది. కానీ అది వెనక్కి తగ్గలేదు. మంగళవారం, ఐసీసీ తన డిమాండ్‌ను పునఃపరిశీలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును అభ్యర్థించింది, దానిని బీసీబీ తిరస్కరించింది.

T20 World Cup 2026: భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
India Vs Bangladesh 2026

Updated on: Jan 13, 2026 | 7:22 PM

వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి పెను వివాదం నెలకొంది. తమ జట్టు మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలన్న డిమాండ్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం ఐసీసీ అధికారులతో జరిగిన కీలక వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా బంగ్లాదేశ్ తన మొండివైఖరిని స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లు భారత్‌లో అడుగుపెట్టేది లేదని కుండబద్దలు కొట్టింది.

ఐసీసీ ప్రతిపాదనను తిరస్కరించిన బీసీబీ..

వరల్డ్ కప్ షెడ్యూల్, ప్రయాణ ప్రణాళికలు ఇప్పటికే ఖరారు అయ్యాయని, ఇప్పుడు వేదికలను మార్చడం సాధ్యం కాదని ఐసీసీ బంగ్లాదేశ్‌కు వివరించింది. భారత్‌లో క్రీడాకారులకు ఎలాంటి భద్రతా ముప్పు లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే, ఈ హామీని తోసిపుచ్చిన బీసీబీ ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లామ్, తాము తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆటగాళ్ల ప్రాణాలకు ముప్పు ఉన్న చోట ఆడబోమని మరోసారి తేల్చిచెప్పారు.

వివాదానికి కారణం ఏంటి?

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇటీవలి రాజకీయ పరిణామాలు క్రికెట్ బోర్డుల మధ్య చిచ్చు పెట్టాయి. ముఖ్యంగా:

ఇవి కూడా చదవండి

ముస్తాఫిజుర్ రెహమాన్ విడుదల: ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నుంచి స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు తొలగించడం బంగ్లాదేశ్‌ను ఆగ్రహానికి గురి చేసింది.

ఐపీఎల్ నిషేధం: దీనికి నిరసనగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది.

భద్రతా భయాలు: భారత్‌లో బంగ్లాదేశ్ వ్యతిరేక భావనలు ఉన్నాయని, కాబట్టి తమ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది.

ఐసీసీ నివేదిక ఏం చెబుతోంది?

ఐసీసీ స్వతంత్ర భద్రతా ఏజెన్సీలు నిర్వహించిన సమీక్ష ప్రకారం, భారత్‌లో భద్రతా స్థాయి ‘తక్కువ నుంచి మధ్యస్థంగా’ ఉందని తేలింది. ఏదైనా భారీ అంతర్జాతీయ టోర్నీకి ఇది సాధారణ స్థాయి అని, బంగ్లాదేశ్ టీమ్‌కు ప్రత్యేకంగా ఎటువంటి ప్రమాదం లేదని ఐసీసీ నివేదిక స్పష్టం చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే, వారు తమ పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం.

ముందున్న పరిణామాలు..

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తన గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలలో ఆడాల్సి ఉంది. ఐసీసీ భారత్‌లోనే వేదికలను మార్చి (చెన్నై లేదా తిరువనంతపురం వంటి చోట్ల) నిర్వహించాలని ఆలోచిస్తోంది. కానీ, దేశం వెలుపలకు తరలించడానికి సుముఖంగా లేదు. బంగ్లాదేశ్ గనుక మొండిగా ఉంటే ఈసారి వరల్డ్ కప్ నుంచి ఆ జట్టు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..