ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2022 ముగిసింది. టోర్నమెంట్ అంతటా కొన్ని మ్యాచ్‌లు వర్షార్పణం కాగా.. మరికొన్ని చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగాయి. ఇలా టోర్నీ నుంచి లీగ్ దశలోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంటిబాట పట్టగా.. ట్రోఫీ సాధిస్తుందనుకున్న టీమిండియా సెమీఫైనల్‌లో ఘోర ఓటమిపాలైంది. చివరికి పాకిస్తాన్‌పై అద్భుత విజయాన్ని అందుకుని ఇంగ్లాండ్ ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని చెప్పాలి. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ మొదటి రౌండ్ క్లియర్ చేయడంలో ఫెయిల్ కాగా.. కొంతమంది ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌లను తారుమారు చేశారు. ఇక చాలా చిన్న జట్లు ఊహించిన దానికంటే మెరుగ్గా రాణించాయి. కానీ ఈ టోర్నీ కూడా వివాదాల నుంచి తప్పించుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా అంపైర్ల నిర్ణయాలు రచ్చలేపాయి. ఈ టోర్నమెంట్‌లో అక్టోబర్ 23న, పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌తో వివాదాలు మొదలయ్యాయి.
అక్టోబర్ 23న, MCGలో 90 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో టీమిండియా, పాకిస్తాన్ మధ్య అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఇందులో విరాట్ కోహ్లి 82 పరుగులతో చివరి వరకు అజేయంగా నిలిచాడు. తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అయితే విజయానికి ముందు ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో దుమారం రేగింది. మహ్మద్ నవాజ్ వేసిన మూడో బంతి ఫుల్ టాస్ కాగా, కోహ్లీ సిక్సర్ బాదాడు. అయితే, ఈ సమయంలో కోహ్లీ అంపైర్ వైపు చూసి నో బాల్ డిమాండ్ చేశాడు. అంపైర్ కూడా నో బాల్ ఇచ్చాడు. దీనిపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సహా పలువురు ఆటగాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బంతి నడుము కంటే ఎత్తులో లేదని.. అలాంటి పరిస్థితుల్లో నో బాల్ ఎలా ఇస్తారంటూ బాబర్ వాదన. అయినా అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీనిపై పాక్ అభిమానుల నుంచి పాక్ మాజీ క్రికెటర్ల వరకు పెద్దఎత్తున దుమ్మెత్తిపోశారు.
ఒక వివాదం తర్వాత మరొకటి పుట్టింది. నో బాల్ కంటే ముందుగా నవాజ్ బౌలింగ్‌లో వైడ్ బాల్ వేశాడు. అప్పుడు అతడి బంతి ఖచ్చితమైన స్టంప్ లైన్‌పైకి వచ్చినప్పుడు, కోహ్లీ బౌల్డ్ అయ్యాడు, కానీ దాన్ని ఫ్రీ హిట్‌గా అంపైర్లు ప్రకటించారు. దీంతో కోహ్లీ, దినేష్ కార్తీక్ 3 పరుగులు చేశారు. దీనిపై కూడా పాక్ ఆటగాళ్లు ప్రశ్నలు సంధించారు.
వివాదం ఈసారి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. సూపర్-12లో పాకిస్థాన్ చివరి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో, షకీబ్ అల్ హసన్ పాకిస్థాన్ ఆటగాడు షాన్ మసూద్ వేసిన బంతిని స్వీప్ ఆడే ప్రయత్నంలో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. షకీబ్ డీఆర్ఎస్ తీసుకోగా.. అందులోనూ ఔట్‌గా తేలింది. అయితే రీప్లే, స్నికోమీటర్ బంతి ప్యాడ్‌ను తాకడానికి ముందు షకీబ్ బ్యాట్‌ను తాకినట్లు చూపించాయి. అయితే అంపైర్ దానిని పట్టించుకోకుండా.. బ్యాట్ పిచ్‌కు తగిలిందని బదులిచ్చాడు.
ఈసారి భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వివాదానికి కేరాఫ్ అడ్రెస్ అయింది. భారత్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 9 ఓవర్లలో 66 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. దాదాపు 40 నిమిషాల తర్వాత మళ్లీ మ్యాచ్ ప్రారంభం కావడంతో భారత్ పటిష్టంగా పుంజుకుని 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ అభిమానులు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మైదానం పూర్తిగా ఎండిపోకుండా హడావుడిగా మ్యాచ్ ప్రారంభించారని అంపైర్లను తప్పుబట్టారు. నిజానికి మ్యాచ్ ప్రారంభం కాకపోతే డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం టీమిండియా ఓడిపోయేది.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం బంగ్లా వికెట్ కీపర్ నురుల్ హసన్ మాట్లాడుతూ.. తడిగా ఉన్న ఔట్ ఫీల్డ్ మీద ఆడాల్సి రావడంతో పాటు ఫేక్ ఫీల్డింగ్ సైతం తమను దెబ్బతీసిందన్నాడు. ఫేక్ ఫీల్డింగ్ చేసినందుకు ఐసీసీ నిబంధనల ప్రకారం.. తమ జట్టు ఖాతాలో ఐదు పరుగులు జత చేస్తే.. తాము గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డాడు. ఇది అప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..