టీ20 ప్రపంచకప్ వేదిక మారింది. భారత్‌లో జరగాల్సిన ఈ టోర్నీని యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వెల్లడించారు. అక్టోబర్-నవంబర్ మధ్య విండోలో కోవిడ్ నిబంధనల నడుమ ఈ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమైంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులు, థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ తాజాగా జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
వరల్డ్ కప్ టోర్నమెంట్ డేట్స్‌లో ఎలాంటి మార్పులు లేవని.. క్వాలిఫైయర్స్ ఒమన్‌లో.. టోర్నీ మ్యాచ్‌లు దుబాయ్, షార్జా, అబుదాబీల్లో జరుగుతాయని తెలిపారు. ఐపీఎల్ సెకండాఫ్ కాగానే టీ20 ప్రపంచకప్ మొదలు కానుందన్నారు. కాగా, ఇప్పటికే కోవిడ్ కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ మ్యాచ్‌లు సెప్టెంబర్-అక్టోబర్ విండోలో యూఏఈలో నిర్వహించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సెకండాఫ్ షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ టోర్నీలకు ప్రేక్షకులను అనుమతిస్తారా.? లేదా.? అనేది వేచి చూడాలి.
మరోవైపు ఏప్రిల్‌లో ఇండియా వేదికగా జరుగుతున్న ఐపీఎల్.. కరోనా కలకలం నేపధ్యంలో నిరవధికంగా వాయిదా పడిన విషయం విదితమే. వరుసగా ఆటగాళ్లు, కోచ్‌లతో పాటు అంపైర్లు సైతం వైరస్ బారినపడటంతో బీసీసీఐ టోర్నీని వాయిదా వేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నా.. థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తుడటంతో యూఏఈ వేదికగా జరపాలని నిర్ణయించారు.
Also Read: ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..