
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం (మార్చి 4) సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ పోరు జరగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమనేదే ఎరుగకుండా దూసుకుపోతున్న సౌతాఫ్రికా ఫుల్ ఫామ్‌లో ఉండగా.. కివీస్ జట్టు ఎలాగైనా ఫైనల్ చేరాలని పట్టుదలతో ఉంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవేళ వరుణుడు ఆటంకం కలిగిస్తే ఏ జట్టు ఫైనల్ చేరుతుంది? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికా ప్రస్థానం అప్రహతితంగా సాగుతోంది. గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్-8 వరకు అన్ని మ్యాచ్‌లను గెలిచిన ప్రోటీస్ జట్టు.. భారత్ వంటి బలమైన జట్టును కూడా ఓడించి సెమీస్‌కు దూసుకొచ్చింది. మరోవైపు న్యూజిలాండ్ ప్రయాణం కాస్త ఒడిదుడుకులతో సాగింది. గ్రూప్ స్టేజ్‌లో సౌతాఫ్రికా చేతిలోనే కివీస్ ఓడిపోయింది. ఇక సూపర్ 8లో శ్రీలంకపై గెలిచినా, ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో కేవలం మూడు పాయింట్లతోనే కివీస్ సెమీస్‌లో అడుగుపెట్టింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం.. సెమీఫైనల్ మ్యాచ్‌లకు అదనపు సమయంతో పాటు రిజర్వ్ డే సౌకర్యం కూడా ఉంది. బుధవారం గనుక మ్యాచ్‌కు వర్షం పడితే, అధికారులకు 90 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఒకవేళ ఆ రోజు ఆట సాధ్యం కాకపోతే, గురువారం (మార్చి 5) రిజర్వ్ డే రోజున మ్యాచ్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలవుతుంది. అయితే దురదృష్టవశాత్తూ రిజర్వ్ డే నాడు కూడా వర్షం పడి ఆట పూర్తిగా రద్దయితే మాత్రం విజేతను నిర్ణయించడానికి టాస్ వేయడం గానీ, బౌల్ అవుట్ నిర్వహించడం గానీ చేయరు.
సూపర్-8 పాయింట్ల పట్టిక ఆధారంగానే ఫైనలిస్టును నిర్ణయిస్తారు. సౌతాఫ్రికా తన సూపర్-8 గ్రూప్‌లో 6 పాయింట్లతో టాపర్‌గా నిలవగా.. న్యూజిలాండ్ తన గ్రూప్‌లో కేవలం 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాబట్టి వర్షం వల్ల సెమీఫైనల్ రద్దయితే నిబంధనల ప్రకారం సౌతాఫ్రికా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇప్పటికే చోకర్స్ ముద్రతో ఇబ్బంది పడుతున్న ప్రోటీస్ జట్టుకు ఈసారి అదృష్టం కలిసొచ్చేలా కనిపిస్తోంది. మరి ఈడెన్ గార్డెన్స్‌లో వరుణుడు శాంతిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..