తిరుమల శ్రీవారిని టీమిండియా యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ దర్శించుకున్నాడు. మంగళవారం వీఐపీ విరామ దర్శన సమయంలో సూర్య తన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) అధికారులు సూర్యకు సాదర స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత సూర్య, అతని కుటుంబ సభ్యులు.. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను సూర్యకుమార్ యాదవ్‌కు అందజేశారు ఆలయ అధికారులు. అనంతరం సూర్యను ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు.
అయితే ఈ క్రమంలోనే ఆలయం బయట అభిమానులు సూర్య కుమార్ తో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. తిరుమలకు వెళ్లిన సందర్భంగా.. అందుకు సంబంధించిన రెండు ఫోటోలను సూర్య కుమార్ తన ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అవి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
— Surya Kumar Yadav (@surya_14kumar) February 21, 2023
గతేడాది ముగిసిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్ చేసి, ‘మిస్టర్ 360, స్కై’గా పేరు పొందిన సూర్య.. టీ20, వన్డే మ్యాచ్‌లలో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలిసారి టెస్టుల్లో ఆరంగేట్రం చేసే ఆవకాశం దక్కించుకున్నాడు సూర్య. అయితే తొలి మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. దీంతో రెండో టెస్టులో బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలోనే మార్చి 1 నుంచి జరగనున్న మూడో టెస్టులో సూర్య ఆడతాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మూడో మ్యాచ్ జరగడానికి సమయం ఉండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చాడు సూర్యకుమార్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..