అర డజను మంది ఆటగాళ్లలో రహానే ఒకరు.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

భారత మాజీ కెప్టెన్ అజింక్య రహానేపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ ద్రవిడ్‌లాగే రహానే కూడా తన నాయకత్వానికి తగిన గుర్తింపు పొందలేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 2020-21 సీజన్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో అతను చూపిన అద్భుత కెప్టెన్సీ భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు.

అర డజను మంది ఆటగాళ్లలో రహానే ఒకరు.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
Sunil Gavaskar

Updated on: Aug 05, 2026 | 5:14 PM

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ టెస్టు కెప్టెన్ అజింక్య రహానేపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆటలో ఒక్క శత్రువు కూడా లేని క్రికెటర్లు తనకు తెలిసి అర డజను కంటే తక్కువ మందే ఉంటారని.. వారిని రహానే ఒకడని గవాస్కర్ కితాబిచ్చారు. అతను సగర్వంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించారని కొనియాడారు. భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా తనకు లభించిన అవకాశాలను రహానే అద్భుతంగా వినియోగించుకున్నప్పటికీ, అతనికి రావాల్సిన స్థాయిలో గుర్తింపు, ప్రశంసలు దక్కలేదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ మాదిరిగానే రహానే కూడా తన కృషికి తగిన క్రెడిట్ పొందలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ ద్రవిడ్, రహానే కెప్టెన్సీ కెరీర్‌పై గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

గవాస్కర్ మాట్లాడుతూ.. కెప్టెన్‌గా అజింక్య రహానే రికార్డు అసాధారణమని చెప్పారు. అతని కెప్టెన్సీలో భారత్ ఆడిన ఆరు టెస్టుల్లో నాలుగు విజయాలు సాధించగా, ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి పాలుకాలేదని గుర్తు చేశారు. జట్టు గెలిచినప్పుడు ఎక్కువ ప్రశంసలు బ్యాటర్లు, బౌలర్లకే దక్కుతాయని, కానీ ఓడిపోయినప్పుడు మాత్రం కెప్టెన్, కోచ్‌లపైనే విమర్శలు వస్తాయని పేర్కొన్నారు. ఈ కారణంగానే రహానే నాయకత్వానికి పెద్దగా గుర్తింపు లభించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కూడా టీమిండియా సారధిగా అద్భుతమైన విజయాలు ఇచ్చినప్పటికీ రాహుల్ ద్రవిడ్‌కి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదన్నారు.

2021 ఆస్ట్రేలియా పర్యటనలో రహానే కెప్టెన్సీని గవాస్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అడిలైడ్ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయం పాలైన తర్వాత, విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లడంతో రహానే జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అనంతరం మెల్‌బోర్న్‌లో శతకం సాధించి జట్టుకు విజయం అందించడమే కాకుండా, గబ్బా టెస్టులో చారిత్రక విజయంతో భారత్‌కు 2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అందించాడు. ఆ నాయకత్వం భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమని గవాస్కర్ కొనియాడారు.

Loading...
Unable to load recommendations.
Follow Us